జగన్నాథగట్టుపై నిర్మించిన ట్రిపుల్ ఐటీడీఎం భవనం
కర్నూలు సిటీ: కల సాకారమైంది.. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న శుభతరుణం రానే వచ్చింది. నాలుగేళ్ల కోర్సు పూర్తి చేసుకున్న యువ ఇంజినీర్లు బీటెక్ పట్టాలు అందుకోనున్నారు. ఇందుకు కర్నూలు సమీపంలోని ట్రిపుల్ ఐటీడీఎం(ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫాక్చరింగ్)లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. క్యాంపస్‌లోని నూతన కృష్ణ సెమినార్ హాలులో ఐదో స్నాతకోత్సవాన్ని శనివారం నిర్వహించనున్నారు. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఐఐటీ హైదరాబాద్, రూర్కీ పాలక మండలి అధ్యక్షులు డాక్టర్ బీవీ ఆర్ మోహన్ రెడ్డి, భారతీయ సమాచార రూపకల్పన, తయారీ సంస్థ చైర్మన్ ఆచార్య హెచ్‌ఏ రంగనాథ్ హాజరుకానున్నారు. ఐదో స్నాతకోత్సవంలో 2019–23 బ్యాచ్‌కి చెందిన బీటెక్ విద్యార్థులు 113 మంది, ఎంటెక్ విద్యార్థి ఒకరు పట్టాలు అందుకోనున్నారు. అదే విధంగా వివిధ బ్రాంచ్‌ల్లో ప్రతిభ చూపిన ఐదుగురు విద్యార్థులకు బంగారు పతకాలు బహూకరించనున్నారు.
ప్రతిష్టాత్మక సంస్థగా..
ఏపీ పునర్విభజన చట్టం–2014 ప్రకారం ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్‌ఐటీ డీఎంను కర్నూలుకు మంజూరు చేశా రు. మొదటగా కాంచీపురం(తమిళనాడు)లో మెంటర్ ఇనిస్టిట్యూట్‌గా 2015 ఆగస్టు నెలలో మూడు బీటెక్ కోర్సులతో తరగతులు మొదలయ్యాయి. కాంచీపురం నుంచి 2018లో కర్నూలు తరలించి శాశ్వత క్యాంపస్ ను ప్రారంభించారు. మొదటగా మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సై న్సు కోర్సులు మాత్రమే ఉండేవి. 2019–20 అకడమిక్ ఇయర్ నుంచి ఆర్టిఫీషియుల్ ఇంటలిజెన్స్ అండ్ డా టా సైన్స్ అనే మరో బీటెక్ కోర్సు, మూడు పీహెచ్‌డీ కోర్సులు ప్రారంభించారు. మొదట క్యాంపస్‌లో 75 బీటెక్ సీట్లు ఉండగా.. నేడు 271కి పెరిగాయి.
వసతుల్లో మేటి
దేశంలోని అన్ని ప్రాంతాలకు అనుగుణమైన వాతావరణం ఉండేలా క్యాంపస్‌ను అన్ని వసతులతో తీర్చిదిద్దారు. 152 ఎకరాల విస్తీరణంలోని 60 ఎకరాల్లో భవనాలు నిర్మించారు. క్రీడల కోసం ఇండోర్ స్టేడియం, యోగా, జిమ్‌లు ఏర్పాటు చేశారు. బాస్కెట్‌బాల్ కోర్టు, మినీ క్రికెట్ స్టేడియం సైతం నిర్మిస్తున్నారు. ప్రత్యేకంగా పోస్టల్ కార్యాలయం ఏర్పాటు చేశారు. 24 గంటల వైఫై సేవలు అందుతున్నాయి. మొదట రూ.218 కోట్లు, తరువాత రూ.256 కోట్లతో పనులు పూర్తి చేశారు. తాజాగా మరో రూ.50 కోట్లు మంజూరయ్యాయి. క్యాంపస్‌లో మొత్తం 11 భవనా లు, ఐదు సెమినార్ హాల్స్ ఉన్నాయి. ఒక మల్టీపర్పస్ హాల్ సేవలు అందిస్తోంది. విద్యార్థుల కోసం డిజిటల్ లైబ్రరీ, 5 వేలకుపైగా పుస్తకాలు, వందలాది పరిశోధన పుస్తకాలను అందుబాటులో ఉంచారు. దేశంలో ఉన్నటువంటి 25 ట్రిపుల్ ఐటీల్లో కర్నూలు ట్రిపుల్‌డీఎం మేటిగా నిలుస్తోంది.
కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం
ట్రిపుల్ ఐటీడీఎంలో కోర్సు పూర్తి అయిన వారిలో 80 శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయి. దీపక్ రాథోర్ అనే విద్యార్థి అత్యధికంగా ఏడాదికి రూ.1.36 కోట్ల వార్షిక వేతనంతో అమెజాన్‌లో ఉద్యోగం పొందారు. సరాసరి రూ.9.52 లక్షల వార్షిక వేతనం పొందే ఉద్యోగాలు చాలా మందికి వచ్చాయి. ఎంటెక్ చదివిన వారిలో 100 శాతం మంది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పొందారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ఆటోమేషన్ విభాగాలలో 2023–24 విద్యా సంవత్సరానికిగాను ఎంటెక్ కోర్సులు ప్రారంభించనున్నారు. ఎంటెక్ రెండు సంవత్సరాల్లో ఏదైనా ఒక సంవత్సరం నార్వేలో చదివేందుకు నార్వే ఆగ్ధర్ యూనివర్సిటీతో ట్రిపుల్ ఐటీడీఎం ఒప్పందం చేసుకుంది.
పరిశోధనాత్మక విద్యకు ప్రాధాన్యం
సంస్థలో పరిశోధనాత్మక విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నాం. నాలుగేళ్లలో 30 రీసెర్చ్ ప్రాజెక్టులు సాధించాం. దీంతో పాటు కర్నూలులోని పలు ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులకు రోబోల తయారీపై శిక్షణను ఇస్తున్నాం. వచ్చే నెల చివరి నాటికి క్యాంపస్‌లో 100 శాతం పనులు పూర్తవుతాయి.
– ఎల్‌ఎన్‌వీ సోమయాజులు, ట్రిపుల్ ఐటీ డీఎం, డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment