
వైభవంగా సుశమీంద్రతీర్థుల ఆరాధన
మంత్రాలయం: నడిచే రాఘవేంద్రులుగా పేరుగాంచిన శ్రీరాఘవేంద్రస్వామి మఠం పూర్వ పీఠాధిపతి సుశమీంద్రతీర్థుల ఆరాధన వేడుకలు వైభవంగా నిర్వహించారు. మంగళవారం శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థుల నేతృత్వంలో స్వామిజీ ఆరాధన వేడుకలు కనుల పండువగా చేపట్టారు. ముందుగా సుశమీంద్రతీర్థుల మూల బృందావనానికి విశేష పంచామృతాభిషేకం గావించి విరుల అలంకరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన చిత్ర పటాన్ని బంగారు రథంపై శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. గురుసార్వభౌమ సాహిత్య మండలి భజనలు, కీర్తనలు, వేద పాఠశాల విద్యార్థుల వేద ఘోష, మంగళవాయిద్యాల మధ్య రథయాత్ర కనుల పండువగా కొనసాగింది.
వెంకన్న పట్టువస్త్రాల సమర్పణ
నడిచే రాఘవేంద్రుల ఆరాధన సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు సమర్పించారు. స్థానిక టీటీడీ కల్యాణ మంటపం నుంచి ఆలయ ఏఈఓ మోహన్‌రాజు పట్టువస్త్రాలతో మంగళవాయిద్యాలతో శ్రీమఠం చేరుకున్నారు. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు స్వీకరించారు. అనంతరం సుశమీంద్రతీర్థుల మూల బృందావనం చెంత పట్టువస్త్రాల పూజోత్సవం కానిచ్చారు. వేడుకలో ఏఏవో మాధవశెట్టి, మేనేజర్–ఎ వెంకటేష్‌జోషి తదితరులు పాల్గొన్నారు.