
అపరిశుభ్రతపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం
మహానంది: ‘పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోతే ఎలా? అధికారులు, పంచాయతీ సిబ్బంది పర్యవేక్షించడం లేదా?’ అంటూ నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజులపల్లె గ్రామంలో శనివారం స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాజులపల్లెలోని హోటళ్ల వద్ద పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై కలెక్టర్ ఆగ్రహం చెందారు. వ్యాపారులకు అవగాహన కల్పించి చెత్తబుట్టలు ఏర్పాటు చేయాల్సిన అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించారు.
● గాజులపల్లెలోని పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న పద్మశివ డాబాలో తనిఖీ నిమిత్తం వెళ్లిన జిల్లా కలెక్టర్ పరిసరాలు సరిగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రూ.లక్ష జరిమానా విధించాలని మండల పరిషత్ కార్యాలయ అధికారులను ఆదేశించారు. డాబా పరిసరాలన్నింటిని శుభ్రంగా ఉండేలా చూడాలని, అపరిశుభ్రంగా ఉన్న వస్తువులన్నింటినీ పడేశారు.
మానవత్వం చాటుకున్న జిల్లా కలెక్టర్
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు యువకులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి జిల్లా కలెక్టర్ రాజకుమారి మానవత్వం చాటుకున్నారు. బోయిలకుంట్ల గ్రామానికి చెందిన హరి, రాజా నంద్యాలకు బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో గాయపడ్డారు. అయ్యలూరు వెళ్తున్న కలెక్టర్ రాజకుమారి వారిని చూసి కారు ఆపి చలించారు. వెంటనే వారిద్దరిని స్థానికంగా ఉన్న ఓ వాహనంలో చికిత్స నిమిత్తం గాజులపల్లెలోని ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ మానవత్వాన్ని చూసి స్థానికులు అభినందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, ఈఓఆర్‌డీ నాగేంద్ర, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment