
ఉపాధ్యాయ ప్రమోషన్లకు కసరత్తు!
● సీనియారిటీ జాబితాను
సిద్ధం చేస్తున్న విద్యాశాఖ
● ఉమ్మడి జిల్లాలో 9,500మంది
ఉపాధ్యాయులు
● ఆన్‌లైన్‌లో వివరాల నమోదులో
సమస్యలు
నంద్యాల(న్యూటౌన్): రాష్ట్రంలో ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలను సిద్ధం చేసేందుకు విద్యా శాఖ కసరత్తు ప్రారంభించింది. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలన్నా, డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలన్నా ప్రస్తుతం పని చేస్తున్న టీచర్ల సర్వీసు వివరాలు, వారి సీనియార్టీ, రోస్టర్ పాయింట్లు వంటి పలు అంశాలు ముడిపడి ఉంటాయి. అయితే, ఈ విషయంలో అధికారులకు పూర్తిస్థాయిలో స్పష్టత లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను రాష్ట్ర విద్యా శాఖ అధికారులు మరోసారి సిద్ధం చేసేందుకు కసరత్తు చేపట్టారు. ఈ ప్రక్రియ మూడు రోజుల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని కర్నూలు డీఈఓ కార్యాలయంలో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు.
2,206 ప్రభుత్వ పాఠశాలలు
ఉమ్మడి కర్నూలు జిల్లాను పరిగణనలోకి తీసుకుని సీనియారిటీ జాబితాను తయారు చేస్తున్నారు. జిల్లాలో 2,886 ప్రాథమిక, 954 ప్రాథమి కోన్నత, 287 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో వివిధ కేడర్లలో పని చేస్తున్న ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలను తయారు చేసే పనిలో డీఈఓ కార్యాలయాల సిబ్బంది నిమగ్నమయ్యారు.
సీనియార్టీ జాబితా తయారీ ఇలా..
ఉమ్మడి జిల్లాలో 2002వ సంవత్సరం డీఎస్సీ నుంచి 2019వ సంవత్సరం డీఎస్సీ వరకు కేడర్ వారీగా సీనియార్టీ జాబితాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఉపాధ్యాయుల నుంచి వారి విద్యార్హత, డీఎస్సీ పోటీ పరీక్షలో లభించిన మార్కులు తదితర వివరాలను ఎంఈఓలు సేకరించి డీఈఓ కార్యాలయానికి పంపుతున్నారు. వీటిని ప్రత్యేక బృందాలు రికార్డుల ఆధారంగా పరిశీలిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో పదోన్నతుల జాబితాపై కసరత్తు పూర్తవుతుందని నంద్యాల డీఈఓ జనార్దన్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment