బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. సమన్వయ సమావేశాలను నిర్వహించి ఆయా విభాగాలు చేపట్టే పనులపై దిశానిర్దేశం చేశామన్నారు. రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడా రు. వివరాలు ఈఓ మాటల్లో..
● గతేడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11 రోజులు నిర్వహించగా 5.76లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఈ ఏడాది మొత్తం 11 రోజుల్లో 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశాం. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు బుధవారం నుంచి మార్చి1వ తేదీ వరకు ఉభయ దేవాలయాల్లో అన్ని ఆర్జితసేవలను రద్దు చేశాం. అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నాం.
● జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశాం. బుధవారం నుంచి ఈ నెల 23వ తేదీ వరకు మాత్రమే విడతల వారీగా నిర్దిష్ట వేళల్లో మాత్రమే మల్లన్న స్పర్శదర్శనం కల్పిస్తాం.
● వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లులకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశాం. ఉచిత కంపార్ట్‌మెంట్లలో, క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరం తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు, పాలు పంపిణీ చేస్తాం.
● ఆగమ శాస్త్రానుసారంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తాం. స్వామివారి పాగాలంకరణ కార్యక్రమం ప్రత్యేకంగా ఉంటుంది. రథోత్సవం, తెప్పోత్సవం వైభవోపేతంగా నిర్వహిస్తాం.
● గతేడాది బ్రహ్మోత్సవాల్లో 30.5 లక్షల లడ్డూ ప్రసాదాలను భక్తులు కొనుగోలు చేశారు. ఈ ఏడాది 35 లక్షల లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేస్తున్నాం. అన్న దానం భవనం పక్కన 15 లడ్డూ కౌంటర్లు ఉన్నాయి. లడ్డూ ప్రసాదం స్టాక్ పాయింట్ పక్కన ఐ దు, టూరిస్టు బస్టాండ్ వద్ద రెండు కౌంటర్లు పనిచేస్తాయి. ఈ ఏడాది అదనంగా సెంట్రల్ రిసెప్షన్ ఆఫీసు వద్ద లడ్డూ ప్రసాదాల కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాం.
● క్షేత్రంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. మొత్తం 10 ప్రదేశాల్లోని 25 ఎకరాల్లో కారు పార్కింగ్, 14 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఆర్టీసీ బస్సులకు పార్కింగ్ ఏర్పాటు చేశాం. పార్కింగ్ ప్రదేశాల నుంచి దేవస్థానం ఉచితంగా 10 బస్సులను నడపుతోంది.
● మంచినీటికి ఇబ్బందులు లేకుండా క్షేత్ర పరిధిలో వివిధ ప్రదేశాల్లో 30 స్టోరేజ్ ట్యాంకులు, 34 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశాం. కాలినడక మార్గంలో భీమునికొలను మార్గం వరకు పైప్‌లైన్ ఏర్పాటు చేసి తాగునీటిని సరఫరా చేస్తున్నాం. అలాగే వెంకటాపురం, పెద్దచెరువు, నాగలూటి, కై లాసద్వారం వద్ద ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నాం.
● దాతల సహకారంతో అటవీమార్గంలో అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. కై లాసద్వారం వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.
భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు
సీఆర్‌వో ఆఫీసు వద్ద లడ్డూ కౌంటర్
పార్కింగ్ ప్రాంతాల నుంచి
10 బస్సులతో ఉచిత ప్రయాణం
నేటి నుంచి మార్చి 1 వరకు
అలంకార దర్శనం
శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి
ఎం.శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment