రైతు కన్నీరు పెట్టిన రాజ్యం బాగుపడదు
కర్నూలు(అగ్రికల్చర్): పంటలకు మద్దతు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫల మైందని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు. గిట్టు బాటు ధర లేక మిర్చి రైతులు అల్లాడుతున్నా పాలకుల్లో చలనం లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. రైతులు కన్నీరు పెట్టిన రాజ్యం బాగుపడదన్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో విక్ర యాలు లేకుండా నిల్వ ఉన్న మిర్చి దిగుబడులను మంగళవారం కాటసాని పరిశీలించారు. మిర్చి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. పెట్టుబడి వ్యయం ఎంత వచ్చింది.. దిగుబడి ఎలా ఉంది.. మార్కెట్‌లో ధరలు ఎలా ఉన్నాయనే దానిపై రైతులతో చర్చించారు. మిర్చి రైతులు తమ ఆందోళనను కాటసానికి వివరించి కన్నీరుమున్నీరయ్యారు. ఎకరాకు పెట్టుబడి వ్యయం రూ.లక్ష వరకు వస్తోందని, దిగుబడి 20 క్వింటాళ్ల వరకు వస్తున్నా.. క్వింటాకు రూ.10 వేల వరకు మాత్రమే ధర లభిస్తోందని, పెట్టుబడి కూడా దక్కడం లేదని వివరించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ... వైఎస్సార్ సీపీ హయాంలో ప్రతి పంటకు మద్దతు ధర కల్పించామన్నారు. మద్దతు కంటే ధరలు తగ్గిన ప్పుడు రైతులు నష్టపోకుండా ఆర్‌బీకేల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. అప్పట్లో మిర్చి ధర రూ.50 వేలకుపైగా పలికిందని, నేడు కనీసం రూ.10 వేలు కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంటను రైతులు అమ్ముకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. మిర్చి ధర అట్టడుగుకు పడిపోయినా.. ప్రభుత్వం చొరవ తీసుకొని ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. న్యాయం కోసం అన్నదాతలతో కలసి ఉద్యమిస్తామని పేర్కొన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు ఆర్‌బీకేల్లోనే అందుబాటులో ఉంచిందన్నారు. కూటమి ప్రభుత్వం ఆర్‌బీకేలకు ఉరివేస్తోందని మండిపడ్డారు. అనంతరం మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మితో సమావేశమై మిర్చి ధరలు పడిపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాపారులు సిండికేట్ కాకుండా పోటీ తత్వంతో కొనుగోలు చేయాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
మద్దతు ధర కల్పించడంలో
రాష్ట్ర ప్రభుత్వం విఫలం
వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా
అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి
రైతు కన్నీరు పెట్టిన రాజ్యం బాగుపడదు
Comments
Please login to add a commentAdd a comment