పోతిరెడ్డిపాడు నుంచి నీటి సరఫరా బంద్
● గేట్లను మూసివేసిన అధికారులు
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ పది గేట్లను పూర్తిగా మూసివేసి నీటి సరఫరాను బంద్ చేశారు. శ్రీశైలం జలాశయంలో 841 అడుగుల నీటిమట్టం చేరుకునే వరకు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి దిగువ ప్రాంతాలకు నీటిని సరఫరా చేసుకొనే అవకాశాలున్నాయి. అయితే అధికారులు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ గేట్లు మూసివేసి ముందస్తుగానే నీటిసరఫరాను బంద్ చేయటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గేట్లు తెరచి ఉంచితే 2,500 క్యూసెక్కుల నుంచి 3,000 క్యూసెక్కుల వరకు దిగువకు నీటిని సరఫరా చేసుకొనే అవకాశాలున్నాయి. అధికారులు గేట్లు మూసివేసి నీటివిడుదలను నిలిపివేయటం వెనుక ఆంతర్యమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 850.50 , పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్ద 849.50 అడుగుల నీటిమట్టం ఉంది.
జూన్ తర్వాతే నీరు విడుదల
ఈ వ్యవసాయ సీజన్‌కు మంగళవారంతో పోతిరెడ్డిపాడు నుంచి నీటిసరఫరా ముగిసినట్లే. 2025 జూన్ తర్వాత వర్షాలు సమృద్ధిగా కురిస్తే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి నీరు విడుదల చేసుకొనే అవకాశాలు ఉంటాయి. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి 2024 జూలై 27న ఎస్సారెమ్సీలోకి నీరు విడుదల చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 211.4419 టీఎంసీల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment