మా భూమి ఏమైంది మేడం!
● భూ రీ సర్వేలో లోపాలను కలెక్టర్‌కు
వివరించిన రైతులు
ఉయ్యాలవాడ: భూ రీ సర్వే జరిగిన పొలాల విస్తీర్ణంలో తేడా వస్తుండటంతో పలువురు రైతులు కలెక్టర్ రాజకుమారి దృష్టికి తీసుకెళ్లారు. ఎస్.కొత్తపల్లె గ్రామంలో జరుగుతున్న భూముల రీ సర్వేను శుక్రవారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రీ సర్వే ద్వారా క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను పూర్తి స్థాయిలో ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్.కొత్తపల్లె గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకుని 251 మంది రైతులకు చెందిన 973.40 ఎకరాల విస్తీర్ణంలో సర్వే ప్రారంభించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 613 ఎకరాల్లో సర్వే పూర్తయిందన్నారు. గ్రామానికి చెందిన నరసింహుడు అనే రైతు 98 సెంట్ల భూమి ఆన్‌లైన్‌లో నమోదు కాలేదని, మరో రైతు రవికుమార్ తనకు ఎకరా ఉంటే 92 సెంట్లు మాత్రమే చూపుతున్నారని, మిగులు 8 సెంట్ల భూమి ఎక్కడికి పోయిందని కలెక్టర్ ముందు వాపోయారు. అలాగే మరి కొంత మంది రైతులు విస్తీర్ణంలో కొలతల్లో తేడాలు వస్తున్నాయన్నారు. సర్వే నెంబర్ 141లో 8.79 ఎకరాల విస్తీర్ణంలో కొలతలు వేస్తుండగా క్షేత్రస్థాయిలో తేడాలు వున్నాయని మండల సర్వేయర్ విజయలక్ష్మి, తహసీల్దార్ శ్రీనివాసులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ రికార్డులలో ఉన్న వివరాలపై అవగాహన కల్పిస్తూ కొలతల్లో తేడాలు లేకుండా రైతులకు న్యాయం జరిగేలా రీ సర్వే చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా సర్వేయర్ జయరాజు, ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు, ఆర్‌అండ్‌బీ డీఈ సునీల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఉపాధి సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మండలంలో ఏ మేరకు పనులు జరుగుతున్నాయని, ఎంత మంది కూలీలు పనుల్లోకి వస్తున్నారని ఏపీఓ రవిప్రకాష్‌ను కలెక్టర్ ఆరా తీశారు. 1000 మంది కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొనాల్సి వుండగా కేవలం ప్రతి రోజు 500 మంది హాజరవుతున్నట్లు ఏపీఓ చెప్పడంతో మండిపడ్డారు. కూలీల హాజరు పెంచాలని ఆదేశించారు. గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలను నిప్పంటించి పచ్చదనాన్ని నాశనం చేస్తున్న విషయాన్ని కలెక్టర్ గుర్తించి ‘మేరేమి చేస్తున్నారు’ అంటూ ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు, ఏపీఓ రవిప్రకాష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చని మొక్కలను నాశనం చేసిన వ్యక్తులను గుర్తించి వెంటనే వారికి నోటీసులు అందజేసి కేసులు నమోదు చేయాలని ఉపాధి, పోలీస్ శాఖను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment