కేఆర్‌ఎంబీ కర్నూలులో ఏర్పాటు చేయాలి
నంద్యాల(అర్బన్): కృష్ణానది యాజమాన్య బోర్డు (కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు)ను విజయవాడ లో ఏర్పాటు చేస్తామనే ప్రభుత్వ ప్రకటనపై రాయలసీమ సాగునీటి సాధన సమితి, ప్రజా రైతు సంఘాలు భగ్గుమన్నాయి. కర్నూలులోనే కేఆర్‌ఎంబీని ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం నంద్యాల పట్టణంలోని సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి నివాస గృహం నుంచి గాంధీచౌక్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు అందించేటప్పుడు ఆ ప్రాంతానికి శ్రీశైలం ప్రాజెక్టుతో అనుబంధం తెగిపోయిందన్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డును శ్రీశైలం ప్రాజెక్టు ఉన్న కర్నూలు జిల్లాలోనే ఏర్పాటు చేయాలన్నారు. కేఆర్‌ఎంబీని కర్నూలులో ఏర్పాటు చేయకపోతే సీమ వాసులు తాగు, సాగునీటికి ఇబ్బందులు పడక తప్పదన్నారు. ఈనెల 25వ తేదీలోగా యాజమాన్య బోర్డు మార్పుపై ప్రకటన చేయకపోతే అదే రోజు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. నిరసన ర్యాలీలో ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment