ఆళ్లగడ్డ: ఎగువ అహోబిలంలో వెలసిన ఉగ్ర నరసింహస్వామి గరుడోత్సం అంగరంగ వైభవంగా సాగింది. ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత ఉగ్ర నరసింహస్వామిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహుడు విశేష అలంకరణ గావించిన గరుడ వాహనాన్ని అధిష్టించి విద్వాంసుల మంగళకరమైన వాయిద్యాలు, వేద పండితుల మంత్ర పఠనములు.. భక్తుల గోవింద నామస్మరణల నడుమ అట్టహాసంగా ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. ఈ గరుడ మహోత్సవం శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారు జామువరకు కొనసాగాయి. ఎగువ అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం చేపట్టారు.
శాస్త్రోక్తంగా తీర్థవారి చక్రస్నానం..
అహోబిల బ్రహ్మత్సోవాల ముగింపు సందర్భంగా దిగువ అహోబిలంలో ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా తీర్థవారి చక్రస్నానం నిర్వహించారు. ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాముల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి 108 కళశాలతో తిరుమంజనం నిర్వహించారు. అనంతరం సుదర్శనమూర్తికి, నిత్య అభిషేక ఉత్సవమూర్తికి కోనేరులో శాస్త్రోక్తంగా తీర్థవారి చక్రస్నానం చేయించారు. అర్చకులు, వేదపండితులు, ఆలయ అధికారులు, సిబ్బంది, వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ద్వాదశ ఆరాధనం, పుష్పయాగం వేడుక శనివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు.
తేజోమయం ఉగ్రనరసింహుడి దర్శనం
శాస్త్రోక్తంగా ముగిసిన
ఎగువ అహోబిలేశుడి బ్రహ్మోత్సవాలు
వైభవోపేతం.. గరుడోత్సవం