పండుగలు ఉన్నా.. ప‘రేషాన్‌’ | - | Sakshi
Sakshi News home page

పండుగలు ఉన్నా.. ప‘రేషాన్‌’

Published Tue, Mar 18 2025 8:56 AM | Last Updated on Tue, Mar 18 2025 8:51 AM

2014 నుంచి 2019వ సంవత్సరాల మధ్య కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం హిందువుల ముఖ్య పండుగలతోపాటు రంజాన్‌ పండుగకు పండుగ తోఫా పేరుతో వివిధ రకాల నిత్యావసర సరుకులు సరఫరా చేసింది. 2024 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్‌ 10 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క పండుగకు తోఫాలు పంపిణీ చేయలేదు. గతంలో రంజాన్‌ పండుగను పురస్కరించుకుని కార్డుదారులైన ముస్లిం కుటుంబాలకు గోధుమపిండి, చక్కెర, సేమియా, ఆయిల్‌, నెయ్యితో కూడిన తోఫా అందజేసింది. ఈ నెల 31వ తేదీన రంజాన్‌ పండుగ ఉండటంతో ఇప్పటి వరకు రంజాన్‌ తోఫా ఊసే లేకపోవడంతో ముస్లింలు పెదవి విరుస్తున్నారు. రేషన్‌ షాపుల ద్వారా బియ్యం, చక్కెర తప్ప ఇతర సరుకులు ఇవ్వకపోగా రంజాన్‌ పండుగకు ఎలాంటి సరుకులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రంజాన్‌ తోఫా ఒట్టిదేనా..

కోవెలకుంట్ల: పేదల సంక్షేమాన్ని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రతి నెలా అందించే రేషన్‌ సరుకుల్లో భారీగా కోత పెడుతోంది. కార్డుదారులకు అన్ని రకాల సరుకులు అందడం లేదు. రేషన్‌ షాపుల్లో బియ్యం, చక్కెర తప్ప మిగిలిన నిత్యావసరాలు పంపిణీ కావడం లేదు. ఈ నెల హిందువులకు, ముస్లింలకు పెద్ద పండుగలు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వంలో కనీస స్పందన కరువైంది. ప్రజలకు బియ్యం, చక్కెర మినహా మిగిలిన ఏ ఒక్క నిత్యావసర సరుకులు అందలేదు. జిల్లాలోని కోవెలకుంట్ల, బనగానపల్లె, ఆళ్లగడ్డ, డోన్‌, ఆత్మకూరు, శ్రీశైలం, రుద్రవరం, నందికొట్కూరు, నంద్యాల, ప్యాపిలి మండలాల్లో ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు ఉన్నాయి. ఆయా ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల పరిధిలో 1,204 రేషన్‌ షాపులు ఉండగా 351 ఎండీయూ వాహనాల ద్వారా ప్రతి నెలా ప్రజా పంపిణీ కొనసాగుతోంది. జిల్లాలో 5.33 లక్షల రేషన్‌కార్డులకు సంబంధించి ప్రతి నెలా 71,074 క్వింటాళ్ల బియ్యం, 2,666 క్వింటాళ్ల చక్కెర సరఫరా చేస్తున్నారు.

పండుగలు ఎలా జరుపుకోవాలి?

జిల్లాలో మార్చి నెలకు సంబంధించి కార్డుదారులకు బియ్యం, చక్కెరతోనే సరిపెట్టారు. కందిబేడలకు మార్కెట్‌లో ధర పెరగడంతోపాటు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ఈ నేపథ్యంలో సబ్సిడీపై అందించకుండా కోత పెట్టినట్లు తెలుస్తోంది. మార్కెట్‌లో కందిపప్పు కిలో రూ. 150 ధర పలుకుతుండటంతో పేద, సామాన్య ప్రజలుకు కొనడం భారంగా మారింది. ఈ నెలలో కార్డుదారులకు కందిపప్పు పంపిణీ చేయకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరులో హిందువులకు ఉగాది పండుగ ఉంది. అలాగే ముస్లింలకు పవిత్ర రంజాన్‌ పండుగ వస్తోంది. పండుగల నేపథ్యంలో సైతం ప్రభుత్వం కందిపప్పు, ఇతర నిత్యావసర సరుకులు ఇవ్వలేదు. పండుగలు ఎలా జరుపుకోవాలని ఆందోళన చెందుతున్నారు.

ఎండీయూ వాహనాలేవీ?

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్‌ సరఫరా చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎండీయూ వాహనాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో కొందరు ఆపరేటర్లు విధుల నుంచి తప్పుకోవడం, కొన్ని గ్రామాల్లో ఆపరేటర్లను బలవంతంగా తొలగించారు. ఎండీయూ వాహనాలు లేని గ్రామాల్లో డీలర్లు ఇళ్ల వద్ద ప్రజా పంపిణీని కొనసాగిస్తున్నారు. గతంలో ఇంటి వద్దనే సరుకులు అందేవని, ప్రస్తుతం డీలర్ల ఇంటి వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకోవాల్సి వస్తోందని కార్డుదారులు వాపోతున్నారు. మరికొన్ని వాహనాలు మరమ్మతులకు గురికావడంతో ఎండీయూ వాహనాల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఒకవైపు సరుకుల్లో కోత, మరోవైపు సరుకులు సక్రమంగా ఇంటికి సరఫరా కాక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు బియ్యం, చక్కెరతోపాటు కందిపప్పు, జొన్నలు, రాగులు, తదితర నిత్యావసర సరుకులు కార్డుదారుల ఇళ్లవద్దనే సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

త్వరలో సరఫరా చేస్తాం

కోవెలకుంట్ల స్టాక్‌ పాయింట్‌కు మార్చి నెలకు సంబంధించి కందిపప్పు కొంత మేర సరఫరా అయింది. ఈ నెల 20 తర్వాత పూర్తిస్థాయిలో అందుతుంది. కంది పప్పు వచ్చిన వెంటనే కార్డుదారులకు పంపిణీ చేస్తాం.

– నాగేశ్వరరెడ్డి, సీఎస్‌ డీటీ, కోవెలకుంట్ల

రేషన్‌ సరుకుల్లో భారీ కోత

కార్డుదారులకు అందని కందిపప్పు

ఇంటి వద్దకు రాని ఎండీయూ

వాహనాలు

ఇప్పటి వరకు రంజాన్‌ తోఫా

ఊసేలేదు

ఉగాది పండుగ వస్తున్నా అందని

నిత్యావసరాలు

ప్రజలకు తప్పని తిప్పలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement