కొత్తపల్లి: ఎలాంటి కోతలు లేకుండా గ్రామాలకు దశల వారీగా ప్రతి రోజూ 24 గంటలు కరెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ జిల్లా ఎస్‌ఈ సుధాకర్ కుమార్ తెలిపారు. కొత్తపల్లి మండలం గోకవరం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో త్రీఫేజ్ చార్జింగ్ యూనిట్ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఆర్డీఎస్‌ఎస్ (రీవ్యాప్ట్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్) స్కీంతో జిల్లాలో 249 ఫీడర్లకు దశల వారీగా 24 గంటలు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా ఇవ్వనున్నామన్నారు. జిల్లా విద్యుత్ శాఖ ఈఈ శ్రీనివాసులు, ఆత్మకూరు ఈఈ జయశంకర్, ఆత్మకూరు, నంద్యాల డీఈఈలు రామసుబ్రమణ్యం, రంగస్వామి పాల్గొన్నారు.
వైభవంగా సుయతీంద్రతీర్థుల పూర్వారాధన
మంత్రాలయం: నవ మంత్రాలయ శిల్పి, రాఘవేంద్రస్వామి మఠం పూర్వపు పీఠాధిపతి సుయతీంద్రతీర్థులు పూర్వారాధన వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో మంగళవారం వేకువ జామున సుప్రభాత సేవతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత పీఠాధిపతి గురువులైన సుయతీంద్రతీర్థుల వేడుకలు శాస్త్రోక్తంగా చేపట్టారు. ముందుగా స్వామిజీ మూల బృందావనానికి నిర్మల్య విసర్జన గావించి పుష్ప, పంచామృతాభిషేకం చేపట్టి ప్రత్యేక పూలతో విశేష అలంకరణ గావించారు. వేడుకల్లో భాగంగా యాగ మంటపంలో సుయతీంద్రతీర్థుల ప్రశస్థితి భక్తులకు ప్రవచించారు.