రైతు ఇంట మెరిసిన ఆణిముత్యాలు
● ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ముగ్గురు కుమారులు ● చిన్నారులకు ఉచితంగా బోధన చేస్తున్న రైతు
బేతంచెర్ల: ఆ రైతుకు చదువు అంటే ఎంతో ఇష్టం. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత చదువుకు దూరమయ్యాడు. అయితే వ్యవసాయం చేస్తూనే తన కలను కుమారులతో సాకారం చేసుకున్నాడు. ముగ్గురు కొడుకులను బాగా చదివించడంతో వారు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. తన బిడ్డల్లానే గ్రామంలో చిన్నారులు కూడా శ్రద్ధగా చదువుకుని ప్రయోజకులు కావాలని ఆకాంక్షిస్తూ సాయంత్రం వేళ ఉచితంగా విద్యను బోధిస్తున్నాడు. ఎంబాయి గ్రామం పాడి పంటలకు ప్రసిద్ధి. ఆ గ్రామంలో ఈడిగ వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరమ్మ దంపతులది సాధారణ వ్యవసాయ కుటుంబం. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని దగ్గరగా చూసిన ముగ్గురు కుమారులు పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించారు. పెద్ద కుమారుడు తులసీ రామ్ గౌడ్ డిగ్రీలో బీజెడ్‌సీ పూర్తి చేసి 2014లో ఎయిర్ ఫోర్స్‌లో మెడికల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం బెంగళూరులో పని చేస్తున్నారు. రెండవ కుమారుడు బెనర్జీ గౌడ్ వెటర్నరీలో డిప్లొమో పూర్తి చేసి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అనిమల్ హస్బెండరీగా ఎంపికయ్యారు. కొలుములపల్లె సచివాలయంలో పని చేస్తూ.. ఇటీవల వెటర్నరీ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది ముద్దవరంలో విధులు నిర్వహిస్తున్నారు. చిన్న కుమారుడు తరుణ్‌కుమార్ గౌడ్ 2019లో అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. ఇటీవల కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మాణిక్యరావు చేతుల మీదుగా డాక్టర్ పట్టా అందుకున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రభుత్వ కొలువులు సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పట్టుదలతో సాధించారు
నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను. ఆర్థిక పరిస్ధితుల కారణంగా ఉన్నత చదువులకు వెళ్లలేక గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ పిల్లలను బాగా చదివించాలనుకున్నా. వారు కూడా పట్టుదలతో చదివి ప్రయోజకులయ్యారు. చిన్నప్పటి నుంచి పిల్లలు పాఠశాలకు వెళ్లి వచ్చిన తరువాత బోధన ఆంశాలపై చర్చించి, సందేహాలను నివృత్తి చేసేవాడిని. మా పెద్ద కుమారుడు తులసీరామ్ గౌడ్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం సాధించిన తరువాత తమ అన్నను ఇద్దరు తమ్ములు ఆదర్శంగా తీసుకుని ఉద్యోగాలు సాధించారు. నా కొడుకుల మాదిరిగానే గ్రామంలోని చిన్నారులు కూడా బాగా చదువుకోవాలని నా వంతుగా సాయంత్రం వేళలో ఉచితంగా బోధన చేస్తున్నాను.
– వెంకటేశ్వర్లు గౌడు, ఎంబాయి
రైతు ఇంట మెరిసిన ఆణిముత్యాలు