ఒకప్పుడు బ్యాంకులకు వెళ్తే అక్కడ పనిపూర్తి చేసుకుని తిరిగి రావడానికి గంట నుంచి రెండు గంటల సమయం పట్టేది. కోవిడ్ తర్వాత ఈ పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. అప్పటి వరకు వివిధ రకాల పథకాల సొమ్ము అకౌంట్‌లో ప్రభుత్వం వేస్తే దానిని తీసుకోవడానికై నా బ్యాంకులకు, ఏటీఎంలకు వెళ్లేవారు. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ కారణంగా డబ్బు ఎలా వస్తుందో, ఎలా పోతుందో కూడా తెలుసుకోలేకపోతున్నారు. దాదాపుగా అన్ని చోట్లా ఏటీఎంలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రుణాలను సైతం బ్యాంకు యాప్‌ల ద్వారానే నిమిషాల్లో తీసుకునే సౌలభ్యం వచ్చింది. కేవలం కరెంట్ బ్యాంకు ఖాతాలు ఉన్న కొద్ది మంది వ్యాపారులు మాత్రమే పెద్ద మొత్తంలో డబ్బులు వేయడానికి, డ్రా చేయడానికి మాత్రమే బ్యాంకులకు వెళ్తుండటం గమనార్హం. ఖాతాల్లో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి, అనుమానాలు తీర్చుకోవడానికి మాత్రమే బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు.