
వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై టీడీపీ నాయకుల వేధింపులు
సాక్షి, నంద్యాల: జిల్లాలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. తాము చెప్పినట్లు వినకపోతే పోలీసుల సాయంతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఎదురు మాట్లాడితే జైలుకు పంపిస్తాం.. నీ అంతు తేలుస్తామంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల వేధింపులతో పట్టణంలోని సలీంనగర్‌కు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఫయాజ్ ఎలుకల మందు తాగి మంగళవారం ఆత్మహత్యకు యత్నించారు. సలీంనగర్‌కు చెందిన ఫయాజ్‌కు అదే ప్రాంతానికి చెందిన జునైద్‌ల మధ్య రంజాన్ పండగ రోజు చిన్న వాగ్వాదం జరిగింది. దీంతో జునైద్ బంధువులు టీడీపీ నాయకులైన మైపూజ్, ఖాజాలు బాధితుడైన ఫ యాజ్‌ను తీవ్రంగా బెదిరించారు. అధికార పార్టీ తో పెట్టుకుంటున్నావ్.. నీ అంతు తేలుస్తాం.. నిన్ను జైలుకు పంపిస్తామంటూ హెచ్చరించారు. దీంతో భయపడిపోయిన ఫయాజ్ ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అయినా టీడీపీ నాయకుల పగ చల్లారలేదు. రెండో పట్టణ సీఐ ఇస్మాయిల్ అండతో ఇద్దరు కానిస్టేబుళ్లను ఫయాజ్ ఇంటికి పంపి విచారణ పేరుతో బాధితుడి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించారు. దీంతో పరువుపోయిందంటూ, తనను మానసికంగా హింసిస్తున్నారనే ఆవేదనతో ఫయాజ్ మంగళవారం మధ్యాహ్నం ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఫయాజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తనను వేధింపులకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నారు.
● భయంతో ఆత్మహత్యాయత్నం