
భూమా వర్సెస్ ఇరిగెల
● పంచాయతీ స్థలంపై విషయంపై ఇరువర్గాల బాహాబాహీ ● జేసీబీని తీసుకెళ్లిన టీడీపీ నాయకులు ● అడ్డుకున్న జనసేన కార్యకర్తలు ● లింగందిన్నె గ్రామంలో ఉద్రిక్తత
ఆళ్లగడ్డ: నియోజకవర్గంలో ‘కూటమి’ నేతల మధ్య కుంపటి రాజుకుంది. నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గవిభేదాలు ఒక్కసారి భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే అఖిలప్రియ వర్గానికి చెందిన టీడీపీ నాయకులు పంచాయతీ స్థలాన్ని కబ్జా చేసేందుకు సిద్ధమవటంతో జనసేన నాయకుడు ఇరిగెల రాంపుల్లారెడ్డి వర్గానికి చెందిన వారు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. మంగళవారం లింగందిన్నె గ్రామంలో స్థలం ఆక్రమణ విషయమై ఎమ్మెల్యే, ఇరిగెల వర్గాలు ఏకంగా బాహాబాహీకి దిగడం చర్చనీయాంశమైంది.
కబ్జాకు యత్నం..
ఆళ్లగడ్డ మండలం ఎస్ లింగందిన్నె గ్రామం ఎస్సీ కాలనీ సమీపంలో సుమారు 10 సెంట్ల ప్రభుత్వ ఖాళీ స్థలం ఉంది. ఇందులో సుమారు 40 సంవత్సరాల క్రితం పంచాయతీ నిధులతో రక్షిత మంచినీటి పథకం సామాన్లు భద్ర పరిచేందుకు, వాటర్‌మెన్లు సేదతీరేందుకు పంప్ భ భవనం నిర్మిచారు. బోరు, మోటార్ ఉన్న ఈ స్థలం విలువ సుమారు రూ. 30 లక్షల వరకు ఉంటుంది. ఈ స్థలాన్ని టీడీపీ నాయకులు కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ నిధులతో నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన పంప్ భవనం కూల్చేందుకు ఏకంగా జేసీబీనీ తీసుకుని మందీ మార్బలంతో అక్కడకు చేరుకున్నారు. పంచాయతీలో తీర్మానం చేయకుండా, గ్రామస్తులకు ఎవరికీ చెప్పకుండా ప్రభుత్వ స్థలంలో ఉన్న భవనా న్ని ఎలా కూలుస్తారంటూ టీడీపీ నాయకులను జనసేన కార్యకర్తలు నిలదీశారు. జేసీబీకి అడ్డుపడి నిరసన వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
బెడిసికొట్టిన వ్యూహం
టీడీపీ నాయకులను జనసేన కార్యకర్తలు, ప్రజలు వచ్చి నిలదీయడంతో వారి వ్యూహం బెడిసికొట్టింది. చేసేది లేక టీడీపీ నాయకులు వెనుదిరిగి ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లారు. స్థలాన్ని టీడీపీ నాయకులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌పై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదం నియోజకవర్గంతో పాటు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అక్రమార్కులకు ఎమ్మెల్యే వత్తాసు పలుకుతుండటంతో స్థానికులు మండిపడుతున్నారు.

భూమా వర్సెస్ ఇరిగెల