శ్రీశైలంలో భక్తుల సందడి | - | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో భక్తుల సందడి

Published Mon, Apr 28 2025 1:09 AM | Last Updated on Mon, Apr 28 2025 1:09 AM

శ్రీశ

శ్రీశైలంలో భక్తుల సందడి

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్‌ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. పలువురు భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు పొంది స్వామివారి స్పర్శదర్శనం చేసుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్ని కిటకిటలాడాయి.

నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

గోస్పాడు: కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ సూచనల మేరకు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఉదయం 9.30 ప్రారంభించి మధ్యాహ్నం 12.30 గంటలకు పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఉదయం 9.30 గంటలకు జిల్లా అధికారులందరూ హాజరు కావాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్‌ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నేడు డయల్‌ యువర్‌ డీఎం

నంద్యాల(వ్యవసాయం): డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 11 నుంచి 12.00 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు నంద్యాల ఆర్టీసీ డిపో మేనేజర్‌ గంగాధర రావు ఆదివారం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులు, ప్రజలు తమ సమస్యలను, సలహాలు, సూచనలను 9505065651 నంబరుకు ఫోన్‌ చేసి చెప్పాలని సూచించారు.

ముమ్మరంగా కార్డన్‌ సర్చ్‌

అనుమానిత ప్రాంతాల్లో సోదాలు

49 వాహనాలు సీజ్‌

బొమ్మలసత్రం: శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసుల బృందాలు కార్డన్‌ సెర్చ్‌ చేపట్టారు. జిల్లా ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా ఆదేశాల మేరకు రౌడీ షీటర్లు, నేర చరిత్ర ఉన్న వారి అనుమానిత ఇళ్లలో సోదాలు చేశారు. నంద్యాల పట్టణంలోని దేవనగర్‌ ప్రాంతంలో సరైన పత్రాలు లేని 49 వాహనాలు సీజ్‌ చేశారు. ఆత్మకూరు పరిధిలో ఏఎంబీ పాలెం, గొల్లపేట, కొట్టాల చెరువు గ్రామాలలో 20 లీటర్ల నాటు సారాయి సీజ్‌ చేసి ఒకరిపై కేసు నమోదు చేశారు. నందికొట్కూరు లోని షికారిపేటలో 30 లీటర్ల నాటుసారాయి, 500 లీటర్ల బెల్లంఊట ధ్వంసం చేశారు. అలాగే నందికొట్కూరు రూరల్‌ పరిధిలో లక్ష్మాపురం గ్రామంలో 18 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ప్రజలు అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌ ‘కర్నూలు’

కర్నూలు (టౌన్‌)/ కదిరి అర్బన్‌: శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణం ఎస్టీఎస్‌ఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజులుగా జరిగిన 54వ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో కర్నూలు జట్టు చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది. మొత్తం 16 జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. ఆదివారం టోర్నీ ముగిసింది. ప్రథమ స్థానం కర్నూలు, ద్వితీయ స్థానం పశ్చిమగోదావరి, తృతీయ స్థానంలో శ్రీసత్యసాయి జిల్లా జట్లు నిలిచాయి. విజేత జట్టుకు సీనియర్‌ హ్యాండ్‌బాల్‌ క్రీడాకారుడు ప్రసాద్‌ ట్రోఫీని ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మహేష్‌తో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.

శ్రీశైలంలో భక్తుల సందడి 1
1/1

శ్రీశైలంలో భక్తుల సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement