భూగర్భజల స్థాయిని పెంపొందిద్దాం | - | Sakshi
Sakshi News home page

భూగర్భజల స్థాయిని పెంపొందిద్దాం

Published Tue, Nov 12 2024 12:25 AM | Last Updated on Tue, Nov 12 2024 12:25 AM

భూగర్భజల స్థాయిని పెంపొందిద్దాం

భూగర్భజల స్థాయిని పెంపొందిద్దాం

నారాయణపేట: ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి, భూగర్భజల స్థాయిని పెంపొందించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వర్షపు నీటి సేకరణ, నీటి సంరక్షణ పద్ధతులపై సోమవారం భూగర్భజల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో భూగర్భజలాల లభ్యత, వినియోగం, వర్గీకరణ, జల్‌ సంచయ్‌ జన్‌ భగీదారి ప్రోగ్రాం లక్ష్యాలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ నిర్మాణాలు, వాటి నిర్వహణ తదితర అంశాలపై ప్రదర్శించిన పోస్టర్లను తిలకించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. నీటి సంరక్షణను ప్రోత్సహించడంతో వాతావరణ స్థితిస్థాపకత మెరుగు పడుతుందన్నారు. జల్‌శక్తి అభియాన్‌ కింద జల్‌ సంచయ్‌ జన్‌ భగీదారి ద్వారా సహజ వనరు అయిన భూగర్భజలాలను పెంపొందించుకోవాలన్నారు. అనంతరం భూగర్భజల అధికారి రమాదేవి మాట్లాడుతూ.. వ్యవసాయానికి భూగర్భజల వనరులపై ప్రధానంగా ఆధారపడటం తగ్గించుకోవాలని సూచించారు. నీటిని సృష్టించలేమని.. సంరక్షణే సాధ్యమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇష్టారాజ్యంగా భూగర్భజలాలను వెలికితీయడం కాకుండా వాన నీటిని సాధ్యమైనంత ఎక్కువగా ఇంకింపచేసే విషయాలపై దృష్టి పెట్టాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వర్షపు నీటి సేకరణ, సంరక్షణ పద్ధతులను తెలియజేశారు. అనంతరం అసిస్టెంట్‌ ప్రాజెక్టు ఆఫీసర్స్‌, ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ టెక్నికల్‌ అసిస్టెంట్లకు జలసంరక్షణపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మొగులప్ప, మిషన్‌ భగీరథ ఈఈ రంగారావు, జియాలజిస్ట్‌లు నరేష్‌, లావణ్య, దీరజ్‌ కుమార్‌, చైతన్య, జయమ్మ పాల్గొన్నారు.

విద్యార్థుల మేధాశక్తిని పెంచాలి..

విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం, మేధాశక్తిని పెంపొందించేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ సూచించారు. కలెక్టరేట్‌లో ఎంఈఓలు, కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రతినెలా నిర్వహించే విద్యాశాఖ సమావేశానికి సంబంధించిన పూర్తి నివేదికలను సి ద్ధం చేసుకోవాలన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి, వారి సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పాఠ శాలల తనిఖీలు తక్కువ ఉండటం, రిపోర్టు సమర్పించక పోవడానికి గల కారణాలను తెలుసుకు న్నారు. సమావేశంలో డీఈఓ అబ్దుల్‌ ఘని, సెక్టోర ల్‌ అధికారులు శ్రీనివాస్‌, విద్యాసాగర్‌ ఉన్నారు.

ప్రజావాణికి 10 ఫిర్యాదులు..

కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 10 ఫిర్యాదులు అందాయి. ప్రజల సమస్యలను కలెక్టర్‌ నేరుగా తెలుసుకుని ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీలను పెండింగ్‌ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అడిషనల్‌ కలెక్టర్‌ బేంషలం, ఆర్డీఓ రాంచందర్‌ నాయక్‌, ఏఓ జయసుధ పాల్గొన్నారు.

నీటి సంరక్షణతో వాతావరణ స్థితిస్థాపకత మెరుగు

కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement