తల్లిదండ్రులు దైవంతో సమానం
మద్దూరు: సృష్టిలో తల్లిదండ్రులను మించిన దైవం లేదని, వారిని పూజిస్తే దేవుడిని పూజించినట్లే అని వక్తలు పేర్కొన్నారు. మండలంలోని పెదిరిపాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులు.. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను పూజించే పాదపూజ కార్యక్రమాన్ని పాఠశాల ఆవరణలో చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన అడిషనల్ కలెక్టర్ బెన్‌షాలం, ట్రైనీ కలెక్టర్ గరిమానరులు, డీఈఓ గోవిందరాజులు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నైతిక విలువతో కూడిన విద్యతో పాటు, ఇలాంటి సామాజిక సృమ ఉన్న కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఎంతైన ఉందని అన్నారు. నేటి తరం యువతలో తల్లిదండ్రులను చులకనగా చూసే భావన పెరిగిపోయిందని, దాన్ని నివారించడానికే ఇలాంటి కార్యక్రమం చేపట్టినట్లు పాఠశాల హెచ్‌ఎం బాలకిష్టప్ప తెలిపారు. ఉన్నత పాఠశాల దశకు వచ్చే వరకు విద్యార్థులు తల్లీదండ్రుల మాటలను పట్టించుకోకపోవడం, మేము పెద్దవాళ్లమనే భావన ఏర్పడుతుందని, దీన్ని నివారించడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్బంగా పాఠశాలలోని 247 విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులచే పాదపూజ కార్యక్రమాన్ని యోగా గురువు రమేష్, గాయాకుడు చింతరంజన్‌దాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తల్లీదండ్రుల పాదాలకు అభిషేకం, పూలమాలతో అలంకరించి శాస్త్రోతంగా పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థుల సంస్కృతి కార్యక్రమాలు అహుతులను అలరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నర్సింహా, మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు భాస్కర్, శబరి, స్వప్న, రవీందర్‌రెడ్డి, రవీందర్, రాజు, తదితరులు పాల్గొన్నారు.