స్వయం ఉపాధికి ఊతం | - | Sakshi
Sakshi News home page

స్వయం ఉపాధికి ఊతం

Published Wed, Mar 19 2025 12:28 AM | Last Updated on Wed, Mar 19 2025 12:28 AM

స్వయం

స్వయం ఉపాధికి ఊతం

నర్వ: ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రాయితీపై అందించే రుణాల కోసం నిరుద్యోగ యువత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రుణాల మంజూరు ప్రక్రియ అటకెక్కడంతో యువతీ యువకులకు స్వయం ఉపాధి కరువైంది. కొందరికి ప్రైవేటు ఉద్యోగాలు సైతం లేక తల్లిదండ్రులపైనే ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

ఆర్థిక స్వాలంబన దిశగా..

నిరుద్యోగ యువత ఆర్థిక స్వాలంబన సాధించేలా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు రాయితీపై రుణాలు అందించేందుకు రాజీవ్‌ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టింది. అయితే ఒక్కొక్క నియోజకవర్గానికి ఎన్ని యూనిట్లు మంజూరు చేస్తారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..

రాజీవ్‌ యువ వికాసం పథకానికి దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 17 నుంచి ప్రారంభమైంది. అర్హులైన యువత https///tgobmmsnew.cgg. gov.in పోర్టల్‌లో ఏప్రిల్‌ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్జీదారులు తమ యూనిట్లకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సమర్పించాలి. సంబంధిత కార్పొరేషన్‌తో పాటు కలెక్టర్‌ పర్యవేక్షణలో మండలస్థాయి అధికారుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసి తుది జాబితాను ప్రకటిస్తారు. అర్హుల ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

2017–18 నుంచి జిల్లాలో ఇలా..

● జిల్లాలో 2017–18 ఆర్థిక సంవత్సరం బీసీ కార్పొరేషన్‌ రుణాల కోసం యువత దరఖాస్తు చేసుకోగా.. రూ. 50వేల సబ్సిడీ ఉన్న పథకాలను మాత్రమే అధికారులు గ్రౌండింగ్‌ చేశారు. రూ.లక్ష, రూ. 2లక్షల రుణాలను మంజూరు చేయలేదు. 2018–19, 2019– 20, 2020–21లో ఒక దరఖాస్తుదారుడికి కూడా పైసా రుణం అందలేదు.

● 2017–18లో సబ్సిడీ రుణాల కోసం ఎస్టీ నిరుద్యోగ యువత 584 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 543 మందికి రుణాలు మంజూరయ్యాయి. మొత్తం 96.91 శాతం అచీవ్‌మెంట్‌ సాధించారు. ఇదే ఏడాది గిరిజనల కోసం రూ. 440లక్షలు మంజూరు కాగా.. ఇందులో 220 మందికి రూ.407.50 లక్షలు అందాయి. 92.61 శాతం అచీవ్‌మెంట్‌ సాధించారు. 2018–19, 2019–20 సంవత్సరాల్లో ఎలాంటి రుణాలు ఇవ్వలేదు. 2020–21, 2021–22 సంవత్సరాల్లో 697 మందికి రూ. 927.28 లక్షలు మంజూరైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇందుకోసం మండలాల వారీగా అర్హుల నుంచి అకౌంట్లు సేకరించారు.

● జిల్లాలో మైనార్టీ యువత పరిస్థితి దారుణంగా ఉంది. కార్పొరేషన్‌ పరిధిలో వారికి ఇప్పటి వరకు ఎలాంటి రుణాలు మంజూరు కాలేదు. పేరుకే కార్పొరేషన్‌ ఉందని.. ఎలాంటి రుణాలు అందవని మైనార్టీ యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారులపై టైరు పంక్చర్‌ దుకాణాలు, పండ్ల దుకాణాలు, పాన్‌ డబ్బాలు ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరుచేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

పథకం ద్వారా ప్రయోజనాలు..

ఒక్కో లబ్ధిదారుకు రూ. లక్ష నుంచి గరిష్టంగా రూ. 3లక్షల వరకు ఆర్థికసాయం అందించనున్నారు. రూ.లక్షకు 80శాతం సబ్సిడీ ఇవ్వడంతో పాటు మిగతా 20 శాతం బ్యాంకు ద్వారా రుణం అందజేస్తారు. రూ. 2లక్షలకు 70 శాతం సబ్సిడీ, 30శాతం బ్యాంకు రుణం మంజూరు చేస్తారు. రూ. 3లక్షలకు 50 శాతం బ్యాంకు రుణం అందించనున్నారు. ఈ ఆర్థికసాయంతో చిరువ్యాపారాలు, చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందే అవకాశాలు మెరుగుపడతాయి.

రుణాల మంజూరులో జాప్యం

గత ప్రభుత్వ హయాంలో రుణాల మంజూరులో జాప్యం జరగడంతో నిరుద్యోగ యువత నిరాశకు గురయ్యారు. అయితే వరుస ఎన్నికలు వచ్చిన సమయంలో ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తుందని ఆశించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుణాల మంజూరు ఉంటుందనుకున్నారు. అయితే ముందస్తు ఎన్నికల తర్వాత పంచాయతీ, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, పార్లమెంట్‌, మున్సిపోల్స్‌ ఇలా వరుస ఎన్నికలతో అర్థాంతరంగా రుణాలకు బ్రేక్‌ పడింది. ఇలా అన్ని ఎన్నికలు పూర్తయినా నేటికీ ఎలాంటి రుణాలు మంజూరు కాకపోవడంతో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశకు గురయ్యారు.

‘రాజీవ్‌ యువ వికాసం’తో సబ్సిడీపై రుణాలు

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ

యువతకు అవకాశం

కొన్నేళ్లుగా సబ్సిడీ రుణాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు

అర్హుల ఎంపిక విధానంపై స్పష్టత కరువు

సద్వినియోగం చేసుకోవాలి..

ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే సంకల్పంతో రాజీవ్‌ యువ వికాసం పథకం తీసుకువచ్చింది. ఈ పథకానికి సంబంధించి ఇంకా పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు జారీ కాలేదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు మాత్రం ప్రారంభమయ్యాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ గైడ్‌లైన్స్‌ ప్రకారం అర్హులైన వారికి రుణాల మంజూరు ఉంటుంది.

– అబ్దుల్‌ ఖలీల్‌, జిల్లా బీసీ, ఎస్సీ వెల్ఫేర్‌ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
స్వయం ఉపాధికి ఊతం 1
1/1

స్వయం ఉపాధికి ఊతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement