ప్రజలకు ఉపయోగపడేలా సేవలందించాలి
నారాయణపేట: ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థా నంలో ఉండి ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవలందించడం అదృష్టంగా భావించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ట్రైనీ కలెక్టర్‌గా శిక్షణ పూర్తిచేసుకొని వెళ్తున్న గరిమా నరుల వీడ్కోలు సమావేశం నిర్వహించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్లు బేన్ షాలొమ్, సంచిత్ గ్యాంగ్వర్, ఆర్డీఓ రామచంద్ర నాయక్‌తో పాటు పలువురు జిల్లా అధికారులు ట్రైనీ కలెక్టర్‌తో విధి నిర్వహణలో తమకున్న అనుభవాలను గుర్తు చేసుకొని పూలమాల, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. ఆలిండియా స్థాయిలో 39వ ర్యాంకు సాధించిన గరిమా నరుల ట్రైనీ కలెక్టర్‌గా.. విభిన్న సంస్కృతి సంప్రదాయాలు, భాషలు కలిగిన జిల్లాకు రావడం, ఇక్కడ పని చేయడం భవిష్యత్తులో ఎంతో ఉపయోగ పడుతుందని, ఎక్కడ, ఏ స్థాయిలో ఉన్నా..జిల్లాను మరవద్దని కలెక్టర్ కోరారు. ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల మాట్లాడుతూ.. శిక్షణ కాలంలో కలెక్టర్ తనకు ఎన్నో విషయాల్లో సలహాలు, సూచనలు ఇచ్చి ప్రోత్సహించారని, అదనపు కలెక్టర్లు తమ తమ శాఖల పరిధిలోని వివిధ అంశాలపై తనకు క్లుప్తంగా వివరించి మద్దతుగా నిలిచారని ఆమె తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో జయసుధ, జెడ్పి సీఈవో భాగ్యలక్ష్మి, అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment