నారాయణపేట: కాడ కింద మంజూరైన నిధులతో జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మద్దూరు, గుండుమాల్, కొత్తపల్లి, కోస్గి మండలాల్లో చేపట్టాల్సిన పనులపై నారాయణపేట, వికారాబాద్ జిల్లాల అధికారులతో వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆయా శాఖలకు కేటాయించిన అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని కోస్గి, మద్దూర్ మండలాల్లో చేపట్టాల్సిన పనుల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మద్దూరు నుంచి లింగాల్‌చేడ్ వరకు డబుల్‌రోడ్డు నిర్మాణం, నారాయణపేట నుంచి మద్దూర్ వరకు రహదారి విస్తరణ, కోటకొండ నుంచి మద్దూరు, రావుల్‌పల్లి నుంచి మద్దూరు వరకు బీటీ రోడ్ల నిర్మాణాలు ఏయే దశలో ఉన్నాయని ఆర్‌అండ్‌బీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుండుమల్, కొత్తపల్లిలో మండల కాంప్లెక్స్ పనులు ప్రారంభమయ్యాయా లేదా అని సంబంధితశాఖ అధికారులతో ఆరా తీశారు. ఆయా మండలాలలో సబ్‌స్టేషన్లు, రహదారి విస్తరణలో రోడ్డుకు ఇరువైపులా విద్యుత్ స్తంభాల ఏర్పాటుపై విద్యుత్‌శాఖ అధికారులతో చర్చించారు. మద్దూరు, గుండుమాల్, కొత్తపల్లి, కోస్గి మండలాల్లో అర్హులను గుర్తించి గృహజ్యోతి అమలు చేయాలని ఆదేశించారు. కోస్గి పుర పరిధిలో ప్రధాన రహదారి విస్తరణ, అంతర్గత రహదారుల నిర్మాణాల గురించి ఆరా తీశారు. సమీక్షలో పంచాయతీరాజ్‌శాఖ ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ వసంత్‌నాయక్, ఈఈ శ్రీధర్‌రెడ్డి, డీఈ రాములు, విద్యుత్‌శాఖ డీఈ నర్సింహారెడ్డి, పీఆర్, ఆర్‌అండ్‌బీ ఏఈలు, టీజీఎంఐడీసీ అధికారి పాల్గొన్నారు.
కలెక్టర్ సిక్తా పట్నాయక్