ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు

Mar 25 2025 1:50 AM | Updated on Mar 25 2025 1:46 AM

నారాయణపేట: పోలీస్‌ ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ ఆదేశించారు. సోమవారం ఎస్పీ కార్యాలంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలు పరిష్కరించాలని ఫిర్యాదులు అందజేశారు. మొత్తం ఆరు ఫిర్యాదులను ఎస్పీ నేరుగా స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆయా సీఐలు, ఎస్‌ఐలకు ఫోన్‌లో సూచించారు.

క్రికెట్‌ బెట్టింగ్‌లకుపాల్పడితే కఠిన చర్యలు

నారాయణపేట: ప్రస్తుతం ఐపీఎల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ నడుస్తున్నందున చాలామంది యువత ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడటం జరుగుతుందని.. యువత బెట్టింగ్స్‌ వేసి డబ్బులు నష్టపోయి జీవితాలు నాశనం చేసుకోవద్దని, బెట్టింగ్‌లు నిర్వహించే వారి పట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రికెట్‌ బెట్టింగ్స్‌ వల్ల యువత ఆర్థికంగా దెబ్బతిని చివరికి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని, క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహించే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా పెట్టాలని, క్రికెట్‌ బెట్టింగ్స్‌ అనేవి చట్టారిత్యా నేరమని అట్టి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వినోదం కొరకు ఆడే ఆటను వినోదంగానే చూడాలని, అంతే కాని ఇలాంటి వాటిలో ఇరుక్కొని యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.

విశిష్ట సేవలకుపురస్కారాలు

నారాయణపేట రూరల్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమానికి నారాయణపేట ఆర్టీసీ మహిళా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ మేరకు డీఎం లావణ్య, ఏడీసీ భాగ్యమ్మ, కండక్టర్లు రేణుక, రాజమణికి విశిష్ట మహిళా ప్రతిభా అవార్డులను అందించారు. రవాణా సేవల్లో వారు చేస్తున్న కృషిని ప్రముఖులు ప్రశంసించారు. కార్యక్రమంలో చంద్ర నాయక్‌, బాలయ్య, నారాయణ, లాలు నాయ క్‌, మహిపాల్‌ రెడ్డి, శ్రీనివాస్‌, హిందీ ప్రచార సమితి సెక్రటరీ ఏకే రాజు పాల్గొన్నారు.

27న పశువుల సంత, తైబజార్లకు టెండర్లు

కోస్గి: స్థానిక మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో ఈ నెల 27న గురువారం పశువుల సంత, తైబజార్‌లకు బహిరంగ వేలం ద్వారా టెండర్లు నిర్వహించనున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ నాగరాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2025–26 ఆర్ధిక సంవత్సరానికి సంబందించి వేలంపాట నిర్వహించి అత్యధిక ధర పాడిన వారికి ఒక సంవత్సర కాలానికి టెండరు అందజేస్తామని తెలిపారు. ఈ వేలంలో పాల్గొనదల్చిన అభ్యర్థులు పశువుల సంతకు రూ.2 లక్షలు, తైబజార్‌కు రూ.లక్ష మున్సిపల్‌ కమిషనర్‌, కోస్గి పేరున డీడీ తీసి ఒక రోజు ముందుగానే ఈ నెల 26న సాయంత్రం 4 గంటల వరకు అందజేయలని తెలిపారు. ఆసక్తి గల వ్యక్తులు ఇతర వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

అలసందలు క్వింటాల్‌ రూ.7,229

నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో సోమవారం అలసందలు క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,229, కనిష్టంగా రూ.5,359 ధర పలికింది. అలాగే, శనగలు గరిష్టం, కనిష్టంగా రూ.5,655, పెసర గరిష్టం ,కనిష్టంగా రూ.7,580, వేరుశనగ గరిష్టం 5,240, కనిష్టం రూ.4,720, జొన్నలు గరిష్టం రూ.4,719, కనిష్టం రూ.2,810, ఎర్ర కందులు గరిష్టం రూ.7,189, కనిష్టం రూ.6,521, తెల్ల కందులు గరిష్టం రూ.7,481, కనిష్టంగా రూ.7,229 ధర పలికింది.

ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు 
1
1/1

ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement