విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
నారాయణపేట: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. సోమవారం జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం స్టేజీ దగ్గరలో ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో ఏర్పాటుచేసిన జిల్లాలోని ఊట్కూర్, నారాయణపేట, దామరగిద్ద, మద్దూర్, కోస్గి మండలాల పరిధిలో ఉపాధి హామీ పథకం పనులు, వనమహోత్సవం, స్వచ్ఛభారత్ మిషన్‌కు సంబంధించి ఉపాధి సృష్టించిన నివేదిక, కార్మిక సమీకరణ, గ్రామాల వారీగా లేబర్ నివేదిక, సగటు వేతన రేటు, 100 రోజులు పూర్తిచేసుకున్న కుటుంబాలు, సకాలంలో చెల్లింపుపై ఆయా సిబ్బందితో కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనుల విషయంలో అధికారులు, సిబ్బంది చాలా అలసత్వం వహిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని వారం రోజులలో పనితీరు మెరుగుపర్చుకుని, లక్ష్య సాధనకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. ఒక్కో గ్రామంలో కేవలం 8 నుంచి 10 మంది మాత్రమే ఉపాధి పనులకు రావడం ఏమిటని ప్రశ్నించారు.
కొరవడిన పర్యవేక్షణ
క్షేత్రస్థాయిలో ఎంపీడీవోల పర్యవేక్షణ కొరవడిందని, ఎంపీఓలు, ఏపీఓలు, ఈసీలు, టీఏలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరూ సరిగ్గా పనిచేయడం లేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, ఉద్యోగులు మహబూబ్‌నగర్ నుంచి వస్తున్నారో, ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారో అంతా తెలుసని, మంగళవారం నుంచి ఉదయం 7 గంటల వరకు గ్రామాలలో ఉండి ఉపాధి పనులకు కూలీలను అధిక సంఖ్యలో తీసుకువెళ్లి పనుల్లో వేగం పెంచాలన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మిగతా జిల్లాలలో ఉపాధి హామీ పనులు, వనమహోత్సవం, స్వచ్ఛభారత్ మిషన్ పనులు బాగా జరుగుతున్నాయని, కానీ మన జిల్లాలో ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. ముఖ్యంగా మద్దూరు, కోస్గి, దామరగిద్ద మండలాలలో ఉపాధి హామీ పనులలో ప్రగతి ఏమీ లేదని చెప్పారు. ఎందుకింత నిర్లిప్తత ఉందని నిలదీశారు. ఉపాధి హామీ లాంటి పెద్ద పథకాన్ని వెనుకబడిన మన జిల్లాలో ఉపయోగించుకోకపోతే ఎలా ? అని, వారం తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటే చర్యలు తప్పక ఉంటాయని ఆమె పునరుద్ఘాటించారు. అదనపు కలెక్టర్ సంచిత్ గ్యాంగ్వర్, జెడ్పి సీఈవో భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి
క్షయ వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో మాట్లాడారు. జిల్లాలో 14,707 పరీక్షలు నిర్వహించగా 903 కేసులు నమోదు కాగా వాటిలో 185 టార్గెట్ ఉన్నాయన్నారు. అందులో 183 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. టీబీ వ్యాధిని అంతం చేసేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలన్నారు.
పనితీరు మెరుగు పర్చుకొని కూలీల సంఖ్య పెంచాలి
లక్ష్య సాధనకు చిత్తశుద్ధితో పనిచేయాలి
కలెక్టర్ సిక్తా పట్నాయక్