మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పోరాటాలతోనే కార్మిక హక్కులను సాధించుకోగలుగుతామని తెలంగాణ ప్రగతిశీల భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం (టీయూసీఐ) రాష్ట్ర అధ్యక్షుడు ఎం.హన్మేష్, ప్రధాన కార్యదర్శి కె.సూర్యం అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ టౌన్ హాల్ నుంచి భవన నిర్మాణ కార్మికులతో ర్యాలీ తీశారు. అనంతరం బోయపల్లిగేట్ సమీపంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సంఘం మూడో రాష్ట్ర మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారన్నారు. వారి కోసం సంక్షేమ పథకాలను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధనికుల కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. భవ న నిర్మాణ కార్మికులకు కనీస పింఛను రూ. ఆరు వేలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.కృష్ణ, బీఓసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబశివుడు, టీయూసీఐ నాయకులు సి.వెంకటేశ్, పి.అరుణ్‌కుమార్, దేవదానం, కె.రవి, కిరణ్ పాల్గొన్నారు.