
లైన్ క్లియర్..!
పేట –కొడంగల్ ఎత్తిపోతలకి 560 ఎకరాల భూ సర్వే పూర్తి
● రైతులను ఒప్పించడంలో ఎమ్మెల్యేలు సఫలం
● మొదట్లో అడ్డంకులు, అభ్యంతరాలు, నిరసనలు
● సీఎం భరోసాతో రైతుల హర్షం
● పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వకపోవడంతో అన్నదాతల్లో అయోమయం
నారాయణపేట: సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ సర్వేను ఎట్టకేలకు పూర్తి చేశారు. కలెక్టర్ సిక్తాపట్నాయక్ దిశానిర్ధేశంతో రెవెన్యూ అధికారులు, సర్వేయర్ల బృందం, ఇరిగేషన్ అధికారుల బృందం చకచక పూర్తి చేశారు. నష్ట పరిహారం విషయంలో రైతుల్లో ఎన్నో అనుమానాలు ఉండడం.. పూర్తి స్థాయిలో స్పష్టత ఇస్తేనే భూసర్వేకు ఒప్పుకుంటామంటూ పలుమార్లు పనులను అడ్డుకున్నారు.
సీఎం మాటతో రైతుల్లో ఆశలు
సీఎం రేవంత్‌రెడ్డి ఫిబ్రవరి 21న నారాయణపేటలో జరిగిన బహిరంగ సభలో ఈ ప్రాజెక్టుకు సహకరించాలని కోరారు. అలాగే, ఈ ప్రాజెక్టుతో జిల్లా అంత సస్యశ్యామలం అవుతుందని ప్రాజెక్టుకు అవసరమయ్యే భూ సేకరణకు సహకరించాలని, భూములు కోల్పోయే రైతులకు ఎకరానికి మార్కెట్ విలువ ప్రకారం అందిస్తామని తెలిపారు. ఎకరాకి రూ. 10 నుంచి 20 లక్షలు ఇచ్చే అవకాశం ఉంటే తను చొరవ తీసుకొని ఇప్పించే ప్రయత్నం చేస్తానని భరోసా ఇచ్చారు. దీంతో రైతులు భూసర్వే విషయంలో ఆందోళన చేయకుండా సహకరించడంతో ముందుకు సాగింది.
నష్టపరిహారంపై అయోమయం
ఇదిలాఉండగా, ప్రాజెక్టు నిర్మాణంలో తాము విలువైన భూములు కోల్పోతున్నామంటూ రైతులు ఒకింత ఆందోళన చెందుతున్నారు. భూ పరిహారం ఎంత ఇస్తారనేది ఇటు ఎమ్మెల్యేలు.. అటు అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో రైతుల్లో కొంత అయోమయం నెలకొంది. ఇది వరకు 2013 భూ చట్టం ప్రకారం భూ నష్టపరిహారం ఏవిధంగా ఇచ్చారో అదేవిధంగా ఇస్తారంటూ అధికారులు చెబుతుండగా.. అప్పటి భూ ధరలు వేరు, ఇప్పటి ధరలు వేరు అంటూ రైతులు స్పష్టం చేస్తున్నారు. ఎకరాకు సీఎం చెప్పిన మాట ప్రకారం వస్తే తప్పా సరిపోదంటూ రైతులు బహిరంగంగానే చెబుతున్నారు. భూ పరిహారమెంత అనేది అధికారులు, ఎమ్మెల్యేలు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
నోటిఫికేషన్‌తో భూ సేకరణ
ఈ ఎత్తిపోతల పథకం కింద కావాల్సిన భూముల సర్వే పూర్తి అయింది. రైతులు అందరూ సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భూ సేకరణకు సంబంధించి సర్వే నంబర్‌లతో కూడిన భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేస్తాం. రైతులకు ప్రభుత్వ నిబంధనల మేరకు నష్ట పరిహరం అందజేస్తాం.
– రాంచందర్ నాయక్, ఆర్డీఓ, నారాయణపేట