
నష్టపరిహారంపై తగిన చర్యలు తీసుకోవాలి
నారాయణపేట: ఎస్సీ ఎస్టీ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ కేసులను పోలీసు అధికారులు సీరియస్‌గా తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. డీఎస్పి లింగయ్య ఈ ఏడాదిలో 7 ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి బాధితులకు నష్టపరిహారం అందించడంలో బడ్జెట్ కారణంగా ఆలస్యం జరుగుతుందని సి సెక్షన్ అధికారిని అఖిల ప్రసన్న కలెక్టర్‌కి తెలిపారు. బడ్జెట్ వచ్చిన వెంటనే రెండు వారాలకోసారి నష్టపరిహారం చెల్లించే విధంగా చూస్తామని చెప్పారు. సమావేశంలో గిరిజన సంఘం నాయకులు కిష్ట్యా నాయక్ జిల్లా కేంద్రంలో సేవాలాల్ భవన నిర్మాణానికి స్థలం, నిధులు కేటాయించినా నేటికీ పనులు ప్రారంభం కాలేదని కలెక్టర్‌కు దృష్టికి తీసుకువచ్చారు. అలాగే బుడగ జంగాల సంఘం రాష్ట్ర నాయకులు కృష్ణయ్య మాట్లాడుతూ మక్తల్‌లోని 5వ వార్డు పరిధిలో 70 మంది దాకా ఉన్న బుడగ జంగాల పిల్లల కోసం అక్కడి సమీపంలో అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయాలని కోరారు. బుడగ జంగాల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 5వేల బుడగ జంగాల కుటుంబాలు ఉన్నాయని, వారందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ఈమేరకు కలెక్టర్ మండలాల వారీగా బుడగ జంగాల కుటుంబాల వివరాలు సేకరించి ఆయా మండలాల తహసీల్దార్లకు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేయించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అధికారులు ఉమాపతి, ఖలీల్,జాన్ సుధాకర్, సౌభాగ్యలక్ష్మి, జయ, సుధాకర్ రెడ్డి, శత్రునాయక్ పాల్గొన్నారు.
ప్రతీ ఉద్యోగికి పదవీ విరమణ సహజం
ప్రతి ఉద్యోగికి పదవి విరమణ అనేది సహజమని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయ డిప్యూటీ సీఈవో జ్యోతి పదవీ విరమణ శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. కలెక్టర్ ఆమె చేసిన సేవలను కలెక్టర్ కొనియాడారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. గద్వాలలో తాము విద్యాభ్యాసం చేశామని, జ్యోతి అక్క తన కంటే ఒక ఏడాది సీనియర్ అని, ఎంతో కష్టపడి జెడ్పీ సీఈవో స్థాయికి వెళ్లిందన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్లు వనజ, బండారు భాస్కర్, కలెక్టరేట్ ఏవో జయసుధ, జెడ్పి సీఈవో భాగ్యలకి్‌ష్మ్, డీఆర్డీఓ మొగులప్ప, సిపిఓ యోగానంద్, డీఏఓ జాన్ సుధాకర్ పాల్గొన్నారు.