
అడవిలోకి రాకముందే..
హైదరాబాద్– శ్రీశైలం రహదారి మీదుగా శ్రీశైలం చేరుకునే ప్రయాణికులు సుమారు 60 కి.మీ., దట్టమైన నల్లమల అటవీప్రాంతం గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అడవి మధ్యలో విసిరేస్తున్న ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లతో ఏటా టన్నుల కొద్దీ వ్యర్థాలు పోగవుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు వన్యప్రాణుల మనుగడకే ముప్పుగా మారుతున్నాయి. దీంతో ఎప్పటికప్పుడు రహదారి వెంట ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు అటవీశాఖ ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకుంది. పండుగలు, సెలవు రోజుల్లో వాహనాల రద్దీతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు సైతం పెరుగుతున్నాయి. అడవిలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలుచేస్తూ.. అడవిలోకి రాకముందే చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలు చేపట్టి ప్లాస్టిక్‌ను సేకరిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను మన్ననూర్ చెక్‌పోస్టు వద్ద, శ్రీశైలం నుంచి వచ్చే వాహనాలను దోమలపెంట చెక్‌పోస్టు వద్ద ఆపి తనిఖీ చేస్తున్నారు.
అందరి సహకారంతో..
నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలో వన్యప్రాణుల సంరక్షణ కోసం పూర్తిస్థాయిలో ప్లాస్టిక్‌పై నిషేధాన్ని అమలుచేస్తున్నాం. అటవీశాఖ చేస్తున్న ప్రయత్నాలతో అడవిలో ఏటా పోగవుతున్న ప్లాస్టిక్ చెత్తలో 80 శాతం తగ్గింది. స్థానిక ప్రజలు, వ్యాపారులతోపాటు హైదరాబాద్– శ్రీశైలం రహదారిలో ప్రయాణిస్తున్న వాహనదారుల నుంచి సహకారం లభిస్తోంది.
– రోహిత్ గోపిడి, జిల్లా అటవీ శాఖ అధికారి
●