
ఓటరు నమోదు సులభతరం
నారాయణపేట
గురువారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
వివరాలు 8లో u
కోస్గి: నూతన ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకునే ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం మరింత సులభతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 1వ తేది నుంచి ఎన్నికల సంఘం ఉత్తర్వులు తక్షణం అమల్లోకి రావడంతో 18 సంవత్సరాల వయస్సు నిండిన యువతీ యువకుల నుంచి నూతన ఓటరు నమోదుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికార యంత్రాంగం ఓటరు జాబితాను సిద్ధం చేసినప్పటికి మరోమారు నూతనంగా నమోదు చేసుకునే వారికి సైతం జాబితాలో చోటు కల్పిస్తారు.
ఏటా నాలుగుసార్లు అవకాశం
గతంలో ప్రతియేటా జనవరి నెలలో కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తూ దరఖాస్తులు తీసుకునేవారు. కేవలం జనవరి నెలలోనే నూతన ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టేవారు. నూతన ఉత్తర్వుల ప్రకారం ఇకపై ప్రతియేటా జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ నెలల్లో నాలుగుసార్లు నూతన ఓటర్ల నమోదుకు అవకాశం ఇస్తున్నారు. మరోమారు నూతన ఓటర్ల నమోదుకు అవకాశం రావడంతోపాటు ఇదే ఏడాది నుంచి ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వనుండటంతో గ్రామాల్లో రాజకీయ నాయకులు తమ అనుకూల ఓటు బ్యాంకు పెంచుకునేందుకు నూతన ఓటర్ల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. అధికారులు సైతం మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అఖిల పక్ష నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల సంఘం విదివిధానాలను వివరించనున్నారు.
నమోదు ప్రక్రియ ఇలా..
18 సంవత్సరాల వయస్సు నిండిన వారు బూతుస్థాయి అధికారి (బీఎల్‌ఓ) వద్ద లేదా నేరుగా ఆన్‌లైన్‌లో పూర్తి వివరాలతో నమోదు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారి వివరాలు సంబందిత అధికారి మరోమారు పరిశీలించి అన్ని వివరాలు సరిగ్గా ఉంటే ఆన్‌లైన్‌లోనే ఆమోదం తెలుపుతారు. ఇందుకు సంబందించి నమోదు, ఆమోదం, తిరస్కరణ తదితర వివరాలు నేరుగా దరఖాస్తుదారుని ఫోన్‌కు సమాచారం వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పట్టణాల్లో ఉండే ఓటర్లు తమ ఓటును తమ గ్రామాలకు బదిలీ చేసుకునే అవకాశం సైతం కల్పించారు.
జిల్లాలోమహిళా ఓటర్లే అధికం
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన జాబితాలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలో 13 మండలాల పరిధిలో మొత్తం 3,99,048 మంది ఓటర్లు ఉండగా వారిలో 1,95,475 మంది పురుషులు, 2,03,569 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మరోమారు నూతన ఓటరు నమోదుకు అవకాశం ఇవ్వడంతో మహిళ ఓటర్ల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో 18 సంవత్సరాల వయస్సు నిండిన యువతియువకులు తమ పేర్లు ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
యువత ఓటరుగా నమోదు చేసుకోవాలి
ఎన్నికల కమీషన్ ఉత్తర్వుల మేరకు 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు నూతన ఓటర్లుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం వంటిందనే విషయాన్ని గుర్తించి యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బీఎల్‌ఓల ద్వారా గాని, ఆన్‌లైన్‌లో గాని తమ వివరాలు నమోదు చేసుకుంటే ఓటర్లుగా ధృవీకరించి ఓటరు జాబితాలో నమోదు చేస్తాం.
– రామచందర్, ఈఆర్‌ఓ, నారాయణపేట
ఇక నుంచి జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్‌లో నమోదుకు అవకాశం
గతంలో జనవరిలో ఒక్కసారే నమోదు
ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
ఈ నెల 1 నుంచి అమలు
జిల్లాలో మొత్తం ఓటర్లు 3.99 లక్షల మంది

ఓటరు నమోదు సులభతరం

ఓటరు నమోదు సులభతరం