
సీతమ్మకు కీలక పదవి
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్‌గా సీతా దయాకర్‌రెడ్డి
● మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
● దయాకర్‌రెడ్డి కుటుంబానికి పెద్దపీట
నారాయణపేట: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన కొత్తకోట దయాకర్‌రెడ్డి కుటుంబానికి పదవి వరించింది. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్‌గా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్‌రెడ్డి నియమితులయ్యారు. ఆమెతో పాటు మరో ఆరుగురు సభ్యులను నియమిస్తూ గురువారం ప్రభుత్వం జీఓ ఆర్టీ నంబర్ 45 జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం సీతా దయాకర్‌రెడ్డి హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించారు. చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్లపాటు బాలల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం కొనసాగనున్నారు. సీతా దయాకర్‌రెడ్డికి కీలక పదవి రావడంతో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, దయాకర్‌రెడ్డి అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
మక్తల్ టికెట్ ఆశించిన సమయంలో భరోసా..
దయాకర్‌రెడ్డి కుటుంబానికి మక్తల్, దేవరకద్రల్లో పెద్దఎత్తున అభిమానులు, మద్దతుదారులు ఉన్నారు. సీతమ్మ, దయాకర్ రెడ్డిలు పలు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. రేవంత్‌రెడ్డి ఆహ్వానం మేరకు సీతమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరడం.. కాంగ్రెస్ టికెట్ మక్తల్ నియోజకవర్గం నుంచి ఇవ్వాలని కోరారు. అయితే అధిష్టానం నిర్ణయం మేరకు బీసీ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి టికెట్ ఇస్తూ.. గెలిపించుకొని రావాలని, భవిష్యత్‌లో కీలక పదవి అప్పగిస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో ఎలాంటి రాజకీయ తప్పిదాలు జరగకుండా వాకిటి శ్రీహరి గెలుపులో కీలకపాత్ర పోషించి అధిష్టానం దృష్టిలో పడ్డారు.
టీడీపీని వీడుతూ కంటతడి..
సుదీర్ఘకాలం దయాకర్‌రెడ్డి దంపతులు టీడీపీలో కొనసాగారు. అయితే 2022లో వీరు టీడీపీని వీడారు. టీడీపీతో తమకు ఉన్న అనుబంధం గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. అయితే తెలంగాణలో ఎన్నికలకు సమయం సమీపించడంతో ఏదో ఓ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అంతలోనే 2023 జూన్‌లో దయాకర్‌రెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. దయాకర్‌రెడ్డి అంత్యక్రియల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొని పాడె మోశారు. రాజకీయ పరిణమాలతో రేవంత్‌రెడ్డి సమక్షంలో సీతమ్మ కాంగ్రెస్ గూటికి చేరారు.
రాజకీయరంగ ప్రస్థానం..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాల్లో కొత్తకోట దయాకర్‌రెడ్డి దంపతులు కీలకంగా వ్యవహరించారు. అమరచింత నియోజకవర్గం నుంచి దయాకర్‌రెడ్డి 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో మక్తల్ నుంచి గెలుపొందారు. సీతమ్మ 1994లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2001లో దేవరకద్ర జెడ్పీటీసీగా విజయం సాధించిన ఆమె.. ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 2009లో కొత్తగా ఏర్పడిన దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున సీతాదయాకర్ రెడ్డి పోటీచేసి.. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి స్వర్ణసుధాకర్‌రెడ్డిపై 19,034 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2014 శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున పోటీచేసిన ఆల వెంకటేశ్వరరెడ్డి చేతిలో ఆమె పరాజయం పొందారు.
2023 సెప్టెంబర్ 11న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావు ఠాక్రే, అప్పటి పీసీసీ చీఫ్, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో సీతా దయాకర్‌రెడ్డి హస్తం గూటికి చేరారు. ఉమ్మడి రాష్ట్రంలోని 2009లో ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి భార్యాభర్తలిద్దరూ కలిసి అసెంబ్లీలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించారు.
విద్యాభ్యాసం.. కుటుంబ నేపథ్యం
సీతాదయాకర్ రెడ్డి 1961 అక్టోబర్ 27న కామినేని రాజేశ్వరరావు, భారతి దంపతులకు నిజామాబాద్ జిల్లా సదాశివనగర్‌లో జన్మించారు. ఆర్‌బీవీఆర్‌ఆర్ కళాశాలలో ఇంటర్ (1977–79), బీఏ (1979–82) పూర్తిచేశారు. 1982–84లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ సోషియాలజీ చదివారు. 1984 ఫిబ్రవరి 3న కొత్తకోట దయాకర్ రెడ్డితో సీతాదయాకర్ రెడ్డి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు (సిద్ధార్థ, కార్తీక్) ఉన్నారు.

సీతమ్మకు కీలక పదవి