
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
మక్తల్: రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం మక్తల్ మండలం జక్లేర్‌లోని రేషన్ దుకాణంలో లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేపడుతున్నట్లు వివరించారు. ప్రతి పేద కుటుంబం కడుపునిండా భోజనం తినాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టారన్నారు. మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తమ ప్రభుత్వంలోనే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. అనంతరం పలువురికి సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. కాగా, జక్లేర్‌లోని వాటర్‌ట్యాంకు వద్ద ఉన్న వరిపంటకు మిషన్ భగీరథ నీటిని అక్రమంగా వాడుకుంటుండటంతో తాగునీటి కొరత నెలకొందని గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయిందని అన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని గ్రామస్తులు కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చంద్రకాంత్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్‌చైర్మన్ గణేశ్‌కుమార్, తహసీల్దార్ సతీశ్‌కుమార్, ఎంపీడీఓ రమేశ్‌కుమార్, మాజీ ఉపసర్పంచ్ కట్టా సురేశ్, గురురాజారావు, రవికుమార్, గోవర్ధన్, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.