
సమసమాజ దార్శనికుడు జగ్జీవన్‌రాం
నారాయణపేట: సమసమాజ దార్శనికుడు బాబు జగ్జీవన్‌రాం అని.. ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్‌రాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు ఎస్పీ యోగేష్ గౌతమ్ ముఖ్య అతిథులుగా హాజరై జగ్జీవన్‌రాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించిన మహనీయుడు జగ్జీవన్‌రాం అని కొనియాడారు. ఉప ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. దేశ స్వయం పాలనలో క్యాబినెట్ మంత్రిగా పనిచేసి కార్మిక శాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని గుర్తుచేశారు. దేశ రక్షణ, వ్యవసాయం, టెలీ కమ్యూనికేషన్ శాఖల్లో విశేష సేవలు అందించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ.. అంటరానితనం, కులం పేరుతో కొనసాగుతున్న సామాజిక వివక్ష సంపూర్ణంగా సమసిపోయే దిశగా అందరూ పనిచేసినప్పుడే బాబు జగ్జీవన్‌రాంకు ఘనమైన నివాళి అర్పించిన వారమవుతామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి ఉమాపతి, డీఎస్పీ నల్లపు లింగయ్య, డీఆర్డీఓ మొగులప్ప, డీపీఆర్‌ఓ ఎంఏ రషీద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్, డీఏఓ జాన్ సుధాకర్, సివిల్ సప్లై డీఎం సైదులు, దళిత సంఘాల నాయకులు మహేశ్, శరణప్ప, రమేశ్, వెంకటేశ్, సత్యనారాయణ, సూర్యకాంత్, గడ్డం కృష్ణయ్య పాల్గొన్నారు.

సమసమాజ దార్శనికుడు జగ్జీవన్‌రాం