
రామయ్య కల్యాణ వేడుకకు ముస్తాబు
మక్తల్: శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఆదివారం సీతారాముల కల్యాణ వేడుకను కనులపండువగా నిర్వహించేందుకు మక్తల్ రాంలీలా మైదానాన్ని ముస్తాబు చేశారు. కల్యాణ మండపాన్ని రంగురంగు పూలు, మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. కల్యాణ వేడుకకు హాజరయ్యే భక్తుల కోసం వేసవి దృష్ట్యా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో కల్యాణ వేడుక నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
భక్తిశ్రద్ధలతో లక్ష్మీహయగ్రీవ హోమం
ఎర్రవల్లి: బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం యాగశాలలో శ్రీలక్ష్మీ హ యగ్రీవ హోమం, చతుస్థానార్చన వంటి ప్రత్యే క పూజా కార్యక్రమాలను వేదమంత్రోచ్ఛారణల నడుమ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన, గరుడపట గ్రామోత్సవం, ధ్వజారోహణం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
చిన్నచింతకుంట: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్‌పర్సన్ సీతాదయాకర్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని దమగ్నాపురంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డితో కలిసి సన్నబియ్యం పంపిణీ చేశారు. అనంతరం రేషన్ లబ్ధిదారుల ఇంట్లో సన్నబియ్యం వండించి భోజనం చేశారు. జైబాపు, జైబీమ్, జైసంవిధాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ర్యాలీలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతాదయాకర్‌రెడ్డి మాట్లాడుతూ పేదల కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. భారత రాజ్యంగ పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ అరవింద్‌కుమార్‌రెడ్డి, చిన్నచింతకుంట, కౌకుంట్ల మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేందర్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, మదనాపూరం, దేవరకద్ర మార్కెట్ కమిటీ చైర్మన్లు ప్రశాంత్‌కుమార్, కథలప్ప, అప్పంపల్లి సింగిల్‌విండో చైర్మన్ సురేందర్‌రెడ్డి, నాయకులు వట్టేం శివ, రవికుమార్‌గౌడ్ ఉన్నారు.
రేషన్ డీలర్ల ఖాళీల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ
మహబూబ్‌నగర్ రూరల్: జిల్లాలోని హన్వాడ, కౌకుంట్ల, మహబూబ్‌నగర్ అర్బన్, రూరల్, మిడ్జిల్ మండలాల్లో ఖాళీగా ఏర్పడిన ఆరు రేషన్ డీలర్ భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న ఆర్డీఓ నవీన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యావంతులైన నిరుద్యోగులు 18–40 ఏళ్ల మధ్య వయసు గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా ప్రభుత్వ పని దినాలలో సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అయితే రిజర్వేషన్ల ప్రకారం చూస్తే హన్వాడ మండలం గొండ్యాల–2 బీసీ–ఈ, చిన్నదర్పల్లి బీసీ–ఈ, కౌకుంట్ల మండలం అప్పంపల్లి బీసీ, మహబూబ్‌నగర్ అర్బన్ మండలం అస్లాంఖాన్ స్ట్రీట్ ఓసీ, మహబూబ్‌నగర్ రూరల్ మండలం ఫతేపూర్‌ఎస్టీ, మిడ్జిల్ మండలం సింగందొడ్డి ఓసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.

రామయ్య కల్యాణ వేడుకకు ముస్తాబు

రామయ్య కల్యాణ వేడుకకు ముస్తాబు