
నిర్వహణకు నిధుల్లేవ్..!
మక్తల్: రైతులకు సాగులో మెళకువలు.. సీజన్ల వారీగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో అవగాహన సమావేశాలు.. ఇలా నిరంతరం రైతులను అప్రమత్తం చేసేందుకు గత ప్రభుత్వ హయాంలో రైతు వేదికలను నిర్మించారు. కానీ.. నేడు నిధుల్లేక రైతువేదికల నిర్వహణ భారంగా మారింది. ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ క్లస్టర్ ఏర్పాటు చేసి ఒక్కో దానికి రూ.22 ఖర్చు చేసి జిల్లా వ్యాప్తంగా 76 రైతు వేదికలను నిర్మించారు. ఈ వేదికల నిర్వహణ బాధ్యతలను క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణాధికారులకు అప్పగించింది. వేదికల నిర్వహణకు ప్రతినెల రూ.9వేల వరకు ఖర్చు అయ్యేది. రైతువేదిక విధిగా శుభ్రం చేయడం, తాగునీటి వసతి, స్టేషనరీ, రైతులకు శిక్షణ, విద్యుత్ బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.
పెండింగ్‌లో రూ.2.05 కోట్లు
రైతు వేదిక నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో రైతుల శిక్షణ కార్యక్రమాల భారం వ్యవసాయ విస్తరణాధికారులపై పడుతోంది. అయితే, ఏఈఓలు చేతి నుంచి ఖర్చు పెడుతూ నిధులు వచ్చినప్పుడే తీసుకునేవారు. కానీ, దాదాపు 30 నెలలుగా రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి విడుదల కావడంలేదు. నెల నెల చేతి నుంచే డబ్బులను వెచ్చించాల్సి వస్తుందని పలువురు వ్యవసాయ విస్తరణాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలోని 76 రైతు వేదికలకు రూ.2.05 కోట్ల నిధులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. కానీ, ఆ నిధులు రాకపోవడంతో వేదికల నిర్వహణ విషయంలో ఏఈఓలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
రైతు వేదికకు నెలకు రూ.9వేలు ఖర్చు
నెలల తరబడి విడుదల చేయని ప్రభుత్వం
ఏఈఓలకు తప్పని నిర్వహణ భారం
జిల్లాలో మొత్తం 76 రైతు వేదికలు