
ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ నిరంతర పోరాటం
మద్దూరు: ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ నాయకులు నిరంతర పోరాటం చేయాలని, లగచర్లలో పేదల భూములు లాక్కునే ప్రయత్నం చేసినప్పటి నుంచే సీఎం రేవంత్‌రెడ్డి పతనం ప్రారంభమైందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మద్దూరు పట్టణంలో మద్దూరు, కోస్గి, గుండుమాల్, కొత్తపల్లి మండలాలకు చెందిన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ అవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా వరంగల్‌లో ఈ నెల 27 న నిర్వహించే సభకు ఈ నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో పాల్గొనాలని కార్యకర్తలకు సూచించారు. మీమీ గ్రామాల్లో ఉదయం జెండావిష్కరణ అక్కడి నుంచే వాహానాల్లో బయలుదేరాలని సూచించారు. గ్రామాల్లో మన కార్యకర్తలపై ఎలాంటి కేసులు పెట్టినా, బెదిరింపులకు దిగినా భయపడకండి మండల పార్టీ నాయకులు, నేను మీకు అండగా ఉంటామన్నారు. అవసరమైతే ధర్నాలు కూడా చేద్దామన్నారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పాలనపై ఎవ్వరు సంతృప్తిగా లేరన్నారు. ఇప్పటి వరకు కేసీఆర్ ఇచ్చిన పథకాలను కూడా అమలు చేయలేని పరిస్థితిలో రేవంత్ సర్కార్ ఉందన్నారు. హెచ్‌సీయూ భూములమ్మి ఏదో చేద్దామనుకుంటే కోర్టులో మొట్టికాయలు పడ్డాయని గుర్తుచేశారు. అంతకుముందు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సలీం, వీరారెడ్డి, గోపాల్, రామకృష్ణ, మధుసుదన్‌రెడ్డి, మహిపాల్, బసిరెడ్డి, నర్సింహా, మహేందర్, చంద్రశేఖర్, కార్యకర్తలు పాల్గొన్నారు.