
గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే
నారాయణపేట: విద్య ,మహిళల బలోపేతానికి మహాత్మా జ్యోతిబాపూలే చేసిన కృషి అపూర్వమని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. మహాత్మా జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకొని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించగా..ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ.. చదువు, మహిళల సాధికారత కోసం ఆయన చేసిన కృషి అపూర్వమని, సామాజిక ఉద్యమకారుడిగా, కుల వివక్షతకు వ్యతిరేకంగా ,అన్ని వర్గాల సమానత్వానికి కృషి చేసిన జ్యోతిబాపూలే సేవలు నేటి సమాజం ఆచరిస్తుందన్నారు. దేశంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానుభావుడు అని కొనియాడారు. విద్య ప్రాముఖ్యతను విస్తరింప చేశారని, ప్రత్యేకించి మహిళల విద్యకు కృషి చేశారని, వర్ణ వ్యవస్థ నిర్మూలనకు, అణగారిన కులాలను పైకి తీసుకువచ్చేందుకు తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, డీపీఆర్‌ఓ ఎం. ఏ. రషీద్, సీపీఓ యోగానంద్, షెడ్యూలు కులాల అభివృద్ధి అధికారి ఉమాపతి, రచయిత నరసింహ, గాయకుడు గౌరీ శంకర్, రజక సంఘం నాయకులు మడి వాల్ కృష్ణ, బాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.