
సీ్త్రనిధి రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
కోస్గి రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎంపికై ఆర్థిక పరిస్థితి బాగో లేని నిరుపేద మహిళలకు సీ్త్రనిధి రుణాల మంజూరుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ రుణాలను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందవచ్చని డీఆర్‌డీఓ మొగులప్ప అన్నారు. శుక్రవారం మండలంలోని చంద్రవంచ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులతో ప్రత్యేక సమావేశాన్ని చేపట్టి మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లను బేస్మెంట్ వరకు నిర్మించుకున్న వారికి సీ్త్రనిధి రుణాల ద్వారా రూ.లక్ష మంజూరు చేస్తామని, ప్రతి నెల కొంత మొత్తంలో చెల్లించవచ్చునని, లేని పక్షంలో ప్రభుత్వం నుంచి మంజూరయ్యే మొదటి విడత నిధులతో భర్తీ చేస్తామన్నారు. 20 మంది లబ్ధిదారులతో మాట్లాడగా సగం మంది రుణాలను తీసుకునేందుకు ముందుకు వచ్చారని వివరించారు. ప్రభుత్వం అందించే సహకారాన్ని ఉపయోగించుకొని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. ఇప్పటి వరకు పనులు జరుగుతున్న 14 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరీశీలించారు. అనంతరం మండలంలోని లోదిపూర్, చంద్రవంచ ,పోతిరెడ్డిపల్లి గ్రామాలలోని పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు తాజా కూరగాయలతో నాణ్యమైన భోజనం అందించాలన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ డిప్యూటీ ఈఈ హరికృష్ణ ఎంపీడీఓ శ్రీధర్, ఏపీఎం నర్సింహ పాల్గొన్నారు.