
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
నారాయణపేట: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం తన చాంబర్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నియోజకవర్గానికి ఓ ప్రత్యేక అధికారిని నియమిస్తామని.. ఆయన పర్యవేక్షణలో అర్హులను పారదర్శకంగా ఎంపిక చేయాలని సూచించారు. నియోజకవర్గానికి కేటాయించిన 3,500 ఇళ్లు అర్హులకే కేటాయించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం భూ భారతిపై అధికారులతో చర్చించి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు బెన్‌షాలం, సంచిత్ గంగ్వార్, ఆర్డీఓ రాంచందర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
నేడు డయల్
యువర్ డీఎం
నారాయణపేట రూరల్: జిల్లాలోని కోస్గి, నారాయణపేట ఆర్టీసీ డిపోల పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు బుధవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. ప్రయాణికులు సమస్యలతో పాటు సలహాలు, సూచనలను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు సెల్‌ఫోన్ నంబర్ 73828 26293 తెలియజేయాలన్నారు.
వరి క్వింటా
రూ.2,263
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం వరి (సోనారకం) క్వింటా గరిష్టంగా రూ.2,263, కనిష్టంగా రూ.1,769, వరి (హంసరకం) రూ.1,700 ధర పలికింది. అలాగే పెసర రూ.7,319, జొన్న గరిష్టంగా రూ.3,505, కనిష్టంగా రూ.2,755, ఆలసందలు రూ.6,256–రూ.4,859, ఎర్ర కంది రూ.7,153–రూ.5,422, తెల్ల కంది రూ.6,859 ధరలు లభించాయి.
వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించేందుకు కృషి
మరికల్: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని పార్లమెంట్‌లో ప్రసంగించానని.. వారికి న్యాయం చేయడానికి కృషి చేస్తానని ఎంపీ డీకే అరుణ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో మండల వాల్మీకి సంఘం నాయకులు ఆమెను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. కులవృత్తి లేని బోయలు కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో ఎస్టీలుగా ఉన్నారన్నారు. ఉమ్మడి జిల్లాలోని గద్వాల, మక్తల్, దేవరకద్ర, నారాయణపేట, అలంపూర్ ప్రాంతాల్లో అధిక శాతం వాల్మీకులు ఉన్నారని.. వీరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే పార్లమెంట్‌లో ప్రస్తావించినట్లు చెప్పారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుర్మయ్య, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, జిల్లా కన్వీనర్ నర్సింహులు, మండల అధ్యక్షుడు ఆంజనేయులు, చంద్రప్ప, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు