
‘భూ భారతి’కి సన్నద్ధం
నారాయణపేట: కొత్త రెవెన్యూ చట్టం ‘భూ భారతి’పై గురువారం నుంచి రైతులకు అవగాహన కల్పించడంతో పాటు అర్జీల స్వీకరణకు మద్దూర్, కోస్గి మండలాల తహసీల్దార్లు, ఆర్‌ఐలు, సర్వేయర్లు సన్నద్ధమవుతున్నారు. పేర్ల మార్పు, విస్తీర్ణంతో తేడా, నిషేధిత జాబితాలోని భూములు, వ్యవసాయేతర భూములు, పెండింగ్ విరాసత్‌లు, మ్యూటేషన్లు తదితర వాటి గురించి వివరించి అర్జీలు స్వీకరిస్తారు. మద్దూర్ మండలంలోని 17 రెవెన్యూ గ్రామాల్లో 16,142 మంది పెరిట పట్టాదారు పాసుపుస్తకాలు ఉండగా, 47,706 సర్వేనంబర్లలో 30,622 ఎకరాల భూమి ఉంది. కాగా వ్యవసాయ యోగ్యంకాని భూములు 450 ఎకరాలు ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు.
రెండు బృందాలతో..
కలెక్టర్ ఆదేశాల మేరకు మద్దూర్, కోస్గి తహసీల్దార్ల ఆధ్వర్యంలో ఈ నెల 28 వరకు రోజు విడిచి రోజు కేటాయించిన గ్రామాల్లోని గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు రెవెన్యూ బృందాలు సదస్సు నిర్వహించనున్నారు. మద్దూర్ తహసీల్దార్ మహేశ్‌గౌడ్ బృందం, కోస్గి తహసీల్దార్ బక్క శ్రీనివాసులు బృందం వేర్వేరుగా గ్రామసభలు నిర్వహిస్తారు. 17వ తేదీ నుంచి ఈ రెండు బృందాలు కేటాయించిన గ్రామాల్లో సదస్సులు నిర్వహించి భూ భారతి చట్టం అమలుకు చర్యలు తీసుకోనున్నారు.
ప్రాసెసింగ్ బృందం ఏర్పాటు..
గ్రామసభల్లో స్వీకరించిన అర్జీలను ప్రాసెసింగ్ చేసేందుకు బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ బృందంలో మరికల్ తహసీల్దార్ అనిల్‌కుమార్, జిల్లా సర్వే అధికారి గిరిధర్, కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్, జూనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ, కంప్యూటర్ ఆపరేటర్ మహేశ్, ఆఫీస్ సబార్టినేట్ సమీర్ ఉన్నారు. భూ భారతి కార్యక్రమం అంతా ఆర్డీఓ రాంచందర్‌నాయక్ పర్యవేక్షణలో కొనసాగనుంది.
సీఎం ఇలాఖాలో..
పైలెట్ ప్రాజెక్టుగా మద్దూరును ఎంపిక చేయగా గురువారం రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. కొత్త భూ చట్టంపై తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, సర్వేయర్లకు కలెక్టర్ సిక్తాపట్నాయక్ ప్రొజక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. భూ సమస్యలపై రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారం చూపించాలన్నారు.
ఈ ఫొటోలోని రైతు పేరు గణప రవి. మద్దూర్ స్వగ్రామం. 2012–13లో ఆయన సోదరులతో కలిసి మూడు ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఒక్కొక్కరికి 30 గుంటలు వచ్చింది. ముగ్గురు సోదరులకు పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చినా.. కిందిస్థాయి సిబ్బంది చేసిన తప్పిదంతో ఆయన భూమి ఇప్పటి వరకు పాస్‌బుక్‌లో ఎక్కలేదు. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఇంత వరకు సమస్య పరిష్కారం కాలేదు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నా ఆప్షన్స్ లేవని చేతులెత్తేస్తున్నారని.. కొత్త చట్టంలోనైనా పట్టాదారు పాసు పుస్తకం వస్తుందని ఆశిస్తున్నట్లు రైతు చెప్పారు.
పైలెట్ ప్రాజెక్టుగా మద్దూర్ ఎంపిక
రేపు రెవెన్యూ మంత్రితో ప్రారంభం
రెండు బృందాలతో గ్రామసభల నిర్వహణ

‘భూ భారతి’కి సన్నద్ధం

‘భూ భారతి’కి సన్నద్ధం

‘భూ భారతి’కి సన్నద్ధం

‘భూ భారతి’కి సన్నద్ధం