అమరచింత: జిల్లాలో కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు తరలించిన రైతులకు బకాయిపడిన రూ.6 కోట్లు వెంటనే చెల్లించాలంటూ కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం ఫ్యాక్టరీ కార్యాలయంలో ఈడీ రవికుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న మాట్లాడుతూ ఫ్యాక్టరీ పరిధిలో చెరుకు కోతలు పూర్తయినా ఇప్పటి వరకు చెరుకు రైతులకు బకాయి డబ్బులను చెల్లించడం లేదన్నారు. బకాయిల చెల్లింపు వ్యవహారంపై పలుమార్లు ఫ్యాక్టరీ ఏజీఎం, డీజీఎంలకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే జీఎం కార్యాలయం వద్ద తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు రూ.4.50 కోట్లను చెల్లించామని ఈడీ చెరుకు కార్మిక సంఘం నాయకులకు వెల్లడించారు. దీంతో మిగిలిన మొత్తం వెంటనే రైతు ఖాతాలలో జమ చేయాలని కోరగా.. వారం రోజుల వ్యవధిలో పూర్తి స్థాయిలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చెరుకు రైతు సంఘం నాయకులు వాసారెడ్డి, చంద్రసేనారెడ్డి, ఆంజనేయలు, నాగేంద్రం, రంగారెడ్డి, షాలిమియా తదితరులు పాల్గొన్నారు.