సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ ఐఏఎస్ ఆఫీసర్ నిర్వాకం ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ని ఉలిక్కిపడేలా చేసింది. 15వ శతాబ్దపు స్మారక కట్టడాన్ని కూల్చివేసి బంగ్లాను నిర్మించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పలు రాజకీయా పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై సత్యరమే చర్చలు తీసుకోమని డిమాండ్ చేశాయి. ఈ అనూహ్య ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే..ఢిల్లీలో జల్ విహార్‌లో 15వ శతాబ్దపు రాజభవనం(ప్యాలెస్) ఉంది. ఆ ప్యాలెస్‌లో ఢిల్లీ జల్ బోర్ మాజీ చీఫ్ ఉదిత్ ప్రకాశ్ రాయ్ అతని కుటుంబం ఉంటోంది. వాస్తవానికి ఈ స్మారక కట్టడం పఠాన్ కాలం నాటి రాజభవనం, ఇది సయ్యద్ రాజవంశానికి చెందిన ఖిజర్ ఖాన్ స్థాపించిన ఖిజ్రాబాద్ నగరానికి గుర్తుగా మిగిలిన కట్టడం. ఇది ఢిల్లీ జల్ బోర్డు పరిధిలో ఉంది. ఐతే 2007 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఉదిత్ ప్రకాశ్ రాయ్, అతని కుటుంబం ఇందులో ఉంటోంది. కానీ ఆయన ప్రస్తుతం మిజోరాంలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఆ ప్యాలెస్‌ను ఖాళీ చేయాల్సిందిగా బుధవారం విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ అతని కుటుంబం అక్కడే నివశిస్తుంది.
నిజానికి ఈ స్మారక కట్టడాన్ని జల్ బోర్డు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు అప్పగించాల్సి ఉంది. ఐతే జనవరిలో అధికారుల సంయుక్త సోదాల్లో అది మిస్ అయ్యినట్లు విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ నోటీసులో పేర్కొంది. అంతేగాదు 2021 జనవరిలో ఈ ప్యాలెస్‌ను అప్పగించాలని పురావస్తు శాఖ కోరిందని, ఐతే దాన్ని జరగనివ్వకుండా ఉదిత్ ప్రకాశ్ రాయ్ అడ్డుకున్నారని విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ నోటీసులో తెలిపింది. ఇదిలా ఉండగా, ఈ ప్రదేశంలో అది పెద్ద విస్తీర్ణంలో కోట లాంటి నిర్మాణం ఉండేదని స్థానికులు చెబుతున్నారు.
ఐతే దాని ప్లేస్‌లో బంగ్లా నిర్మించినట్లు సమాచారం. సమీపంలో అందుకు సంబంధించి శిథిలాల భాగాలు కూడా కనిపించాయి. దీంతో ఈ ఘటనపై తక్షణమై చర్యలు తీసుకోవాల్సిందిగా బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌తో సహా పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ లేఖ రాశారు. కాగా, ఇలాంటి దిగ్భ్రాంతి కర ఘటన భారత్‌లోనే జరిగింది, ఈ ఘటనతో భారత పురావస్తు, సాంస్కృతిక శాఖలు మరోసారి నిద్రపోతున్నాయనే అనే విషయాన్ని ప్రూవ్ చేశాయి. ఈ మేరకు సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని దుయ్యబడుతూ..దీనిపై విచారణ జరిపించాల్సిందిగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా ట్వీట్ చేశారు.
(చదవండి: అప్పుడు జనజీవనంలో కలిసి.. ఇప్పుడు 50 కేజీల మందుపాతరకు బలి)
Comments
Please login to add a commentAdd a comment