న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 28న లాంఛనంగా ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, జేడీ(యూ), ఎన్సీపీ, ఎస్పీ, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), కమ్యూనిస్ట్‌లు సహా 19 ప్రతిపక్ష పార్టీలు ముక్త కంఠంతో ప్రకటించాయి ఈ మేరకు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.
ప్రజాస్వామ్యానికి అవమానం
పార్లమెంట్ భవనాన్ని ప్రధాని తన చేతుల మీదుగా ప్రారంభించడాన్ని విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రణాళికలో భాగంగనే మోదీ ఇలా చేస్తున్నారని మండిపడ్డాయి. రాష్ట్రపతితో ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అదే విధంగా మహాత్మాగాంధీని జీవితాంతం వ్యతిరేకించిన హిందూత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ జయంతి రోజు ఈ కార్యక్రమం షెడ్యూల్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
(చూడండి : కొత్త పార్లమెంటు లోపల ఎలా ఉంది?)
ద్రౌపది ముర్ముని పూర్తిగా పక్కకు పెట్టి కొత్త పార్లమెంట్ భవనాన్ని తానే స్వయంగా ప్రారంభించాలనుకున్న మోదీ నిర్ణయం ప్రజాస్వామ్యానికి తీవ్ర అవమానమని తెలిపాయి. ఈ చర్య రాష్ట్రపతి అత్యున్నత పదవికి, రాజ్యంగ స్పూర్తిని, తొలి ఆదివాసీ మహిళా గౌరవాన్ని దెబ్బతీయడమే అవుతుందని ప్రతిపక్షాలు తమ ప్రకటనలో పేర్కొన్నాయి.
అందరికీ ఆహ్వానం: అమిత్ షా
ప్రతిపక్షాల ఆరోపణలపై కేంద్రమంత్రి అమిత్ షా స్పందించారు. పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి ప్రతి ఒక్క పార్టీని ఆహ్వానించామని తెలిపారు. ఉభయ సభల ఎంపీలకు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలకు.. ఇతర నేతలకు భౌతిక, డిజిటల్ రూపాల్లో ఆహ్వానాలు పంపినట్లు పేర్కొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి రావడం.. రాకపోవడంపై నిర్ణయం వారి విజ్ఙతకే వదిలేస్తున్నామన్నారు. మరోవైపు కార్యక్రమాన్ని బహిష్కరించాలనేకునే తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ప్రతిపక్షాలకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సూచించారు.
చదవండి: కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక రాజదండం 'సెంగోల్'.. విశేషాలివే..
రాష్ట్రపతిని విస్మరించారు
కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడంపై ప్రతిపక్షాల అభ్యంతరం వ్యక్తం చేస్తూ వేడుకను బహిష్కరిస్తున్నట్లు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అలాగే రాష్ట్రపతిని ప్రధాని మోదీ దాటవేస్తున్నారని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. కొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన జరిగినప్పుడు మోడీ రాష్ట్రపతిని విస్మరించారని. ఇప్పుడు ప్రారంభోత్సవంలో కూడా అలాగే చేస్తున్నారని, ఇది ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేస్తున్నామని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా ప్రకటించారు.
పార్లమెంట్ కేవలం భవనం కాదు
అంతకుముందు.. ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. రాష్ట్రపతిని ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడంపై తలెత్తుతున్న ప్రశ్నల దృష్ట్యా ఆప్ ఈ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ తెలిపింది. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ట్విటర్ ద్వారా పార్టీ నిర్ణయాన్ని ప్రకటించారు. ‘పార్లమెంట్ కేవలం కొత్త భవనం కాదు. ఇది పాత సంప్రదాయాలు, విలువలు, నియమాలతో కూడిన స్థాపన. ఇది భారత ప్రజాస్వామ్యానికి పునాది. ప్రధాని మోదీకి అది అర్థం కాదు. ఆదివారం నాటి కొత్త భవనం ప్రారంభోత్సవం నేను, నాకోసం అనే ఆయన ఆలోచిస్తున్నారు’ అని ఆయన ట్వీట్ చేశారు.
ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన 19 పార్టీలు:
1. కాంగ్రెస్
2. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)
3. ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే)
4.రాష్ట్రీయ జనతా దళ్
5. శివసేన (ఉద్దవ్ వర్గం)
6. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
7. జనతాదల్ యునైటెడ్(జేడీయూ)
8. సమాజ్ వాదీ పార్టీ
9. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
10. జార్ఖండ్ ముక్తి మోర్చా
11 కేరళ కాంగ్రెస్ (మణి)
12 విడుతలై చిరుతైగల్ కట్చి
13. రాష్ట్రీయ లోక్ దళ్
14. తృణమూల్ కాంగ్రెస్
15. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
16. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
17 నేషనల్ కాన్ఫరెన్స్
18 రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ
19. మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం
Comments
Please login to add a commentAdd a comment