ఆమెకు 54, ఆయనకు 52
లేటు వయసులో ప్రేమ పరిణయం
కర్ణాటక: ఇది అలాంటి ఇలాంటి పెళ్లి కాదు. గొప్ప ప్రేమ పెళ్లి అని అందరూ కొనియాడిన మూడు ముళ్ల కథ ఇది. ఈ జంట 25 సంవత్సరాలు ప్రేమించుకుని ఐదు పదులు దాటాక మాంగళ్య ధారణ చేసుకున్నారు. జిల్లాలోని తరికెరె సమీపంలోని అమృత్‌పూర్‌లోని అమృతేశ్వరస్వామి ఆలయంలో తోటలో నిరాడంబరంగా సుధ (54), మోహన్‌కుమార్ (52)ల వివాహం జరిగింది. తుమకూరు జిల్లా గుబ్బి తాలూకాకు చెందిన మోహన్‌కుమార్, సుధది అజ్జాపూర్.
ఇద్దరూ ఒకే సంస్థలో ఉద్యోగులు
వీరిద్దరూ మైసూరులోని అబ్దుల్ నజీర్‌సాబ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయత్ రాజ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో పంచాయతీరాజ్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు శిక్షణనిచ్చే రిసోర్స్ మాస్టర్ ట్రైనర్‌లుగా పనిచేస్తున్నారు. ఆయన బ్రాహ్మణుడు కాగా, ఆమె మరాఠీ మహిళ. మోహన్‌కుమార్ యువకునిగా ఉన్నప్పుడు కమ్యూనిస్టుల పట్ల ఆకర్షితులై సీపీఎంలో చేరారు. చిక్కమగళూరు జిల్లాలో రైతు సంఘంలో పోరాటం, ఉద్యమంలో పాల్గొన్న వారు. 90వ దశకం ప్రారంభంలో బి.కె.సుందరే కి ఇష్టమైన శిష్యునిగా ఉండేవాడు. తరువాత బెంగళూరు హెచ్‌ఏఎల్‌లో కార్మికుడిగా పనిచేశారు నవ కర్ణాటక ప్రచురణలో వ్యాసాలు రాసేవారు.
అదే సమయంలో సుధ కూడా కమ్యూనిస్టు కార్యకర్తగా సామాజిక ఉద్యమాలలో పాల్గొనేవారు. అలా ఇద్దరికీ పరిచయమై గాఢమైన ప్రేమగా మారింది. 2005లో ఇద్దరూ మైసూరులో పంచాయత్ రాజ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో రిసోర్స్ పర్సన్‌లుగా ఎంపికయ్యారు. మోహన్, సుధ అన్యోన్యతను చూసిన అక్కడి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు వీరిద్దరూ భార్యాభర్తలై ఉండొచ్చని అనుకునేవారు. అయితే అనేక ప్రేమ కథల్లో ఉన్నట్లే వీరి ప్రేమను కూడా కుటుంబాలు ఒప్పుకోలేదు. దీంతో పెళ్లి చేసుకోకుండానే ప్రేమను కొనసాగించారు.
సన్నిహితుల చొరవతో
చివరికి ఈ అపురూప జంటకు పెళ్లి చేసి ప్రేమకు సార్థకత తేవాలని కొందరు ఆప్తులు, స్నేహితులు నిర్ణయించారు. వారి ప్రోత్సాహంతో గత గురువారం అత్యంత నిరాడంబరంగా సుధ మెడలో మోహన్‌కుమార్ తాళి కట్టారు. ఈ పెళ్లి నేటిరోజుల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆర్భాటంగా చేసే గ్రాండ్ వెడ్డింగ్‌లకు భిన్నంగా సరళంగా ఉంది. ఆథిత్యం పేరుతో విపరీతంగా ఖర్చుపెట్టి కొందరు అప్పుల ఊబిలో కూరుకుపోయిన కథలున్నాయి. ఈ నిరాడంబర జంటను బంధుమిత్రులు సుఖీభవ అని ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment