దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాలలో మంగళవారం మూడో విడత పోలింగ్ జరిగింది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేందుకు ఎన్నికల సంఘం పలు చర్యలు తీసుకుంటుంది. ఇదే కోవలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓటర్లను ప్రోత్సహించేందుకు ప్రత్యేక బహుమతులను అందించారు.
భోపాల్‌లోని పలు పోలింగ్ కేంద్రాలలో లాటరీ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ లాటరీ పథకంలో ఉదయం 11 గంటలకు జరిగిన మొదటి డ్రాలో యోగేష్ సాహు డైమండ్ రింగ్ గెలుచుకున్నారు. తరువాత మధ్యాహ్నం 2, 5 గంటలకు మరో రెండు డ్రాలు జరిగాయి. దీని తర్వాత బంపర్ డ్రా కూడా జరిగింది.
లోక్‌సభ ఎన్నికల రెండవ దశలో ఓటింగ్ శాతం తగ్గిన నేపధ్యంలో ఓటర్లను ప్రోత్సహించడానికి భోపాల్‌లోని పలు పోలింగ్ బూత్‌లలో ఎన్నికల సంఘం లాటరీ పథకాన్ని ప్రారంభించింది. ఓటు హక్కును వినియోగించుకున్న వారికి ఆకర్షణీయమైన బహుమతిని అందజేస్తామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
భోపాల్ ఎన్నికల చరిత్రలో తక్కువ ఓటింగ్ నమోదవుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో ఇక్కడ ఓటింగ్ శాతం పెరిగేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చొరవ చూపింది. ఈ నేపధ్యంలో 65.7 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఎన్నికల సంఘం నిర్వహించిన లక్కీ డ్రాలో ముగ్గురు ఓటర్లకు వజ్రాల ఉంగరాలు లభించగా, మరికొంతమందికి మిక్సర్లు, వాటర్ కూలర్లు లభించాయి. కొందరు టీ షర్టులను గెలుచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment