శ్రీనగర్: ఉద్రేకమో.. అనాలోచిత చర్యనో ఏదో తెలియదు కానీ కన్నవాళ్లని.. కట్టుకున్నదాన్ని.. తాను కన్న బిడ్డల్ని వదిలి ముష్కరులతో చేరాడు. కొద్ది రోజుల తర్వాత భద్రతా బలగాలు.. ఇతర ఉగ్రవాదులతో పాటు తనని ముట్టడించాయి. అతడు మారడానికి పోలీసులు ఓ అవకాశం ఇచ్చారు. అతడి నాలుగేళ్ల కుమారుడిని రంగంలోకి దించారు. తన కోసమైనా వెనక్కి రావాల్సిందిగా కొడుకు చేత అభ్యర్థింప చేశారు. బిడ్డను చూసి తండ్రి ప్రాణం విలవిల్లాడింది. దుష్ట చెర నుంచి బయటపడాలని భావించాడు. కానీ ముష్కరులు అందుకు అంగీకరించలేదు. దాంతో వారితో పాటు తాను ప్రాణాలు కోల్పోయాడు. లొంగిపోవాల్సిందిగా తండ్రిని అభ్యర్థిస్తున్న చిన్నారి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఆ వివరాలు.. బ్యాంక్ ఉద్యోగిగా పని చేస్తున్న రఖిబ్ అహ్మద్ మాలిక్ (25) మూడు నెలల క్రితం ఉగ్రవాదులతో చేరాడు. ఈ క్రమంలో సోమవారం జమ్ముకశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో భద్రతా దళాలు ఈ ఉగ్రవాదులు ఉన్న ఇంటిని చుట్టు ముట్టారు. రఖిబ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయని నాడే అతడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వారికి ఎదురుపడితే.. అతడిపై కాల్పులు జరపవద్దని.. రఖిబ్‌తో మాట్లాడే అవకాశం కల్పించాలని కోరారు. దాంతో పోలీసులు మొదట రఖిబ్ భార్య అతడిని లొంగిపోవాల్సిందిగా వేడుకుంది. ‘‘దయచేసి బయటకు వచ్చి లొంగిపో.. నీకు బయటకు రావాలని లేకపోతే.. నన్ను కాల్చేయ్.. మన ఇద్దరు పిల్లలు నాతో పాటే వస్తారు. బయటకు వచ్చి లొంగిపో’’ అంటూ వేడుకుంది. కానీ రఖిబ్ ఆమె మాట అంగీకరించలేదు.
ఆ తర్వాత అతడి నాలుగేళ్ల కుమారిడిని రంగంలోకి దించారు పోలీసులు. బారికెడ్ల అవతల నిల్చున్న తండ్రిని చూసి చిన్నారి మనసు సంతోషంతో నిండిపోయింది. వెంటనే పోలీసులు ఇచ్చిన మైక్ ద్వారా ‘‘వచ్చేయ్ నాన్న.. వీరు నీకు ఎలాంటి హానీ చేయరు.. నేను నిన్ను మిస్ అవుతున్నాను’’ అంటూ బతిమిలాడాడు. బిడ్డ గొంతు విని రఖిబ్ హృదయం తల్లడిల్లింది. బయటకు రావాలని చూశాడు. కానీ తన చుట్టు ఉన్న ముష్కరులు అతడు వెళ్లడానికి అంగీకరించలేదు.
ఇక సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్లో భద్రతాదళాలు రఖిబ్‌తోపాటు మరో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘రఖిబ్ లొంగిపోవాలని భావిస్తున్నట్లు మాకు సమాచారం అందింది. దాంతో అతడికి ఓ అవకాశం ఇచ్చాము. కానీ మిగతా ఉగ్రవాదులు అతడు బయటకు లొంగిపోవడానికి అంగీకరించలేదు. దాంతో మిగతా వారితో పాటు అతడు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు’’ అని తెలిపారు.
చదవండి: కోయి గోలి నహీ చలేగా..
Comments
Please login to add a commentAdd a comment