ఉత్తరకాశీ: సొరంగాన్ని జయించారు.. ఎప్పుడేం జరిగింది.. | 41 Men Trapped Underground Tunnel In Uttarakhand Rescued | Sakshi
Sakshi News home page

ఉత్తరకాశీ: సొరంగాన్ని జయించారు.. ఎప్పుడేం జరిగింది..

Published Wed, Nov 29 2023 9:17 AM | Last Updated on Wed, Nov 29 2023 10:02 AM

41 Men Trapped Underground Tunnel In Uttarakhand Rescued - Sakshi

ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మతాలకు అతీతంగా కోట్లాది మంది చేసిన ప్రార్థనలు ఫలించాయి. 17 రోజుల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఉత్కంఠకు తెరపడింది. ప్రమాదవశాత్తూ సొరంగంలో చిక్కుకొని ఆశ నిరాశల మధ్య క్షణమొక యుగంలా బిక్కుబిక్కుమంటూ గడిపిన 41 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు. 60 మీటర్ల పొడవైన ఎస్కేప్‌ రూట్‌లో ఏర్పాటు చేసిన స్టీల్‌ పైపు గుండా కార్మికులను ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. 

ఎప్పుడేం జరిగింది? 
నవంబర్‌ 12
దీపావళి పండుగ రోజే ఉదయం 5.30 గంటలకు సిల్‌క్యారా–దందల్‌గావ్‌ మధ్య నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయింది. 41 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సొరంగంలోకి ఎయిర్‌–కంప్రెస్డ్‌ పైపుల ద్వారా ఆక్సిజన్, విద్యుత్, ఆహార పదార్థాలు పంపించడానికి ఏర్పాట్లు చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, బీఆర్‌ఓ, ఎన్‌హెచ్‌ఐడీసీఎల్, ఐటీబీపీ తదితర సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.  

నవంబర్‌ 13  
సొరంగంలో ఉన్న కార్మికులతో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఆక్సిజన్‌ కోసం ఉద్దేశించిన పైపుల గుండా అధికారులు మాట్లాడారు. క్షేమంగా ఉన్నామని కార్మికులు బదులిచ్చారు. అదేరోజు సొరంగం పైభాగం నుంచి మట్టి కూలింది. టన్నెల్‌ లోపల 60 మీటర్ల మేర మట్టి విస్తరించింది.  

నవంబర్‌ 14
దాదాపు 900 మిల్లీమీటర్ల వ్యాసార్ధం ఉన్న స్టీల్‌ పైపులను సొరంగం వద్దకు చేర్చారు. మట్టి శిథిలాల గుండా సొరంగంలోకి ఈ పైపులను పంపించాలని నిర్ణయించారు. సొరంగంలో పైభాగం నుంచి మరింత మట్టి కూలడం ఆందోళన కలిగించింది. ఇద్దరు          కార్మికులు స్వల్పంగా గాయపడ్డారు.  

నవంబర్‌ 15
కార్మికులను బయటకు తీసుకురావడానికి డ్రిల్లింగ్‌ యంత్రంతో తవ్వకం పనులు చేపట్టారు. అవి సవ్యంగా సాగకపోవడంతో అత్యాధునిక అగర్‌ మెషీన్‌ను రంగంలోకి దింపాలని నిర్ణయించారు. ఢిల్లీ నుంచి విమానంలో తీసుకొచ్చారు.  

నవంబర్‌ 16
అగర్‌ మెషీన్‌తో డ్రిల్లింగ్‌ పనులు ప్రారంభించారు.   
 
నవంబర్‌ 17
సొరంగంలో 57 మీటర్ల మేర మట్టి శిథిలాలు ఉండగా, 24 మీటర్ల మేర తవ్వకాలు జరిపారు. నాలుగు ఎంఎస్‌ పైపులను శిథిలాల గుండా పంపించారు. ఐదో పైపునకు అవరోధాలు ఎదురుకావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. మరో అగర్‌ మెషీన్‌తో పనులు ప్రారంభించారు. ఐదో పైపును అమర్చే క్రమంలో సొరంగంలో భారీగా పగుళ్ల శబ్ధాలు వినిపించాయి. సొరంగం మొత్తం కుప్పకూలే అవకాశం ఉండడంతో ఆ పనులు వెంటనే నిలిపివేశారు.  

నవంబర్‌ 18
1,750 హార్స్‌పవర్‌ కలిగిన అమెరికన్‌ అగర్‌ మెషీన్‌ వల్ల టన్నెల్‌ లోపల ప్రకంపనలు పుట్టుకొస్తున్నట్లు గుర్తించారు. ప్రత్యామ్నాయం కోసం అన్వేíÙంచారు. సహాయక చర్యల్లో ఆలస్యం జరుగుతుండడంతో ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఐదు రకాల మార్గాలపై దృష్టి పెట్టారు. టన్నెల్‌ ఉపరితలం నుంచి లోపలికి నిలువుగా డ్రిల్లింగ్‌ చేయాలని నిర్ణయించారు.  

నవంబర్‌ 19
ఘటనా స్థలంలో సహాయక చర్యలను కేంద్ర మంతి నితిన్‌ గడ్కరీ స్వయంగా సమీక్షించారు. నిలువుగా కాకుండా అగర్‌ మెషీన్‌తో అడ్డంగా డ్రిల్లింగ్‌ చేస్తే బాగుంటుందని సూచించారు.  

నవంబర్‌ 20
సహాయక చర్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రితో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. టన్నెల్‌లో అడ్డంగా డ్రిల్లింగ్‌ చేస్తుండగా, అగర్‌ మెషీన్‌కు పెద్ద రాయి అడ్డుపడింది. పనులు నిలిచిపోయాయి.  

నవంబర్‌ 21
సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల మొదటి వీడియోను అధికారులు విడుదల చేశారు. ఆహారం తీసుకుంటూ, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కార్మికులు కనిపించారు. తమ కుటుంబ సభ్యులతోనూ వారు మాట్లాడారు. సిల్కియారా వైపు నుంచి అగర్‌ యంత్రంలో అడ్డంగా డ్రిల్లింగ్‌ పనులను అధికారులు పునఃప్రారంభించారు.  

నవంబర్‌ 22
800 వ్యాసార్ధం కలిగిన స్టీల్‌ పైపులను శిథిలాల గుండా 45 మీటర్ల వరకు పంపించారు. మరో 12 మీటర్లే మిగిలి ఉంది. ఇంతలో మరో అవాంతరం వచ్చిపడింది. అగర్‌ మెషీన్‌కు కొన్ని ఇనుప కడ్డీలు అడ్డం వచ్చాయి.  

నవంబర్‌ 23
అడ్డంగా ఉన్న ఐరన్‌ రాడ్లను తొలగించారు. శిథిలాల్లో అడ్డంగా 48 మీటర్ల మేర డ్రిల్లింగ్‌ పూర్తయ్యింది. ఇక్కడ మరో ఉపద్రవం తప్పలేదు. అగర్‌ మెషీన్‌ను ఏర్పాటు చేసిన వేదికకు పగుళ్లు వచ్చాయి.  

నవంబర్‌ 24
పగుళ్లను సరిచేసి, డ్రిల్లింగ్‌ మళ్లీ ప్రారంభించారు. ఈసారి మెటల్‌ గిర్డర్‌ అడ్డుపడింది. దాన్ని తొలగించారు.  

నవంబర్‌ 25
అగర్‌ మెషీన్‌ బ్లేడ్లు శిథిలాల్లో ఇరుక్కున్నాయి. దీంతో రెస్క్యూ ఆపరేషన్‌ పూర్తి కావడానికి మరికొన్ని వారాలు పడుతుందని భావించారు. మరో 12 మీటర్ల మేర డ్రిల్లింగ్‌ మిగిలి ఉంది. కానీ, ఆ పనులు ఆపేయాలని నిర్ణయించారు.

నవంబర్‌ 26
కార్మికులను క్షేమంగా బయటకు తీసుకురావడానికి ప్రత్యామ్నాయ మార్గం కోసం 19.2 మీటర్ల మేర నిలువుగా డ్రిల్లింగ్‌ పూర్తిచేశారు. 700 మిల్లీమీటర్ల వ్యాసార్ధం కలిగిన పైపులు పంపించే పనులు ప్రారంభించారు.  

నవంబర్‌ 27
12 మీటర్ల మేర డ్రిల్లింగ్‌ కోసం ర్యాట్‌–హోల్‌ మైనింగ్‌ నిపుణులను రప్పించారు. అదే సమయంలో టన్నెల్‌ పై భాగం నుంచి నిలువుగా డ్రిల్లింగ్‌ 36 మీటర్ల మేర పూర్తయ్యింది.

నవంబర్‌ 28
సాయంత్రం 7 గంటలకల్లా డ్రిల్లింగ్‌ ఆపరేషన్‌ మొత్తం పూర్తయ్యింది. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది స్టీల్‌ పైపు గుండా కార్మికుల వద్దకు చేరుకున్నారు. వీల్డ్‌–్రస్టెచ్చర్లపై ఒక్కొక్కరిని భద్రంగా బయటకు తీసుకొచ్చారు.  

‘ర్యాట్‌–హోల్‌’పై నిషేధం.. అదే ప్రాణాలు కాపాడింది  
ఎలుకలాగా కలుగును తవ్వేసే ర్యాట్‌–హోల్‌ మైనింగ్‌ అనేది నిజానికి చట్టవిరుద్ధమే. కానీ, సిల్‌క్యారా టన్నెల్లో ఇదే ప్రక్రియ 41 మంది కార్మికుల ప్రాణాలు కాపాడిందని నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ(ఎన్డీఎంఏ) సభ్యుడు లెఫ్టినెంట్‌ జనరల్‌(రిటైర్డ్‌) సయ్యద్‌ అతా హస్నెయిన్‌ మంగళవారం వెల్లడించారు. ఈ సొరంగంలో ర్యాట్‌–హోల్‌ మైనింగ్‌ నిపుణులు 12 మీటర్ల శిథిలాలను 24 గంటల వ్యవధిలో తవ్వేశారని చెప్పారు. వారి కృషి వల్లే కార్మికులు త్వరగా బయటకు వచ్చారని ప్రశంసించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement