ఒక వ్యక్తి తన కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి ధారాదత్తం చేశాడు. ఆఖరికి తన మృతదేహాన్ని సైతం వైద్య పరిశోధనలకు ఉపయోగించమని అధికారులును కోరాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ముజఫర్ నగర్‌లో 85 ఏళ్ల నాథూ సింగ్ అనే వ్యక్తికి సొంత ఇల్లు, కొంత భూమి ఉంది. వాటి విలువ సుమారు రూ. 1.5 కోట్లు. అతనికి ఒక కొడుకు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. కొడుకు సహరాన్‌పూర్‌లో స్కూల్ టీచర్‌గా పనిచేసేవాడు. ఐతే ఇటీవలే అతడి భార్య మరణించడంతో ఒంటరివాడైనా ఆ పెద్ద మనిషి ఓల్డేజ్ హోంకి వెళ్లిపోయాడు.
గత ఏడు నెలలుగా అక్కడే ఉంటున్నాడు. తనను చూసేందుకు తన కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడంతో ఆయన తన ఆస్తి మొత్తం ప్రభుత్వానికి రాసిస్తూ.. వాటిని ఆస్పత్రి, పాఠశాల నిర్మించేందుకు వినియోగించమని కోరాడు. ఈ వయసులో తన బాగోగులు చూసుకోవాల్సిన కొడుకు, కోడలు తనను సరిగా పట్టించుకోకపోవడంతో తన ఆస్తిని ఇలా ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నట్లు ఆవేదనగా చెప్పుకొచ్చాడు. ఆఖరికి తను చనిపోయాక తన మృతదేహాన్ని వైద్య పరిశోధనల కోసం ఇచ్చేయాలని చెప్పాడు.
ఎందుకంటే తన అంత్యక్రియల సమయం అప్పుడూ కూడా తన కొడుకు, కూతుళ్లు తనను చూసేందుకు రాకూడదని చెప్పాడు. ఈ మేరకు ఆ ఓల్డేజ్ హోం మేనేజర్ రేఖా సింగ్ మాట్లాడుతూ.. గత ఏడు నెలలుగా ఇక్కడే ఉంటున్నాడని, కానీ తన కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరూ తనను చూసేందుకు రాలేదని చెప్పారు. దీంతో నాథూ సింగ్ బాగా కలత చెంది ఇలా చేసినట్లు వివరించారు. కాగా, నాథూ సింగ్ వీలునామా మాకు అందిందని, ఆయన మరణాంతరం అది అమలులోకి వస్తుందని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం పేర్కొంది.
(చదవండి: చైనా బెదిరింపులు విదేశాంగ మంత్రికి అర్థం కావడం లేదు:: రాహుల్)
Comments
Please login to add a commentAdd a comment