న్యూ ఢిల్లీ: పిలవని పేరంటం వేయని విస్తరి అని వింటుంటాం. అయితే ప్రస్తుతం వివాహ వేడుకలకు ఆహ్వానం లేకుండానే పోలీసులు అధికారికంగా వెళ్లే పరిస్థితిని కరోనా సృష్టించింది. హర్యానాలోని గురుగ్రామ్ పోలీసు కమిషనర్ కెకె రావు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. నగరంలో జరిగే వివాహ వేడుకలకు పోలీసులు హాజరవుతారు. అతిథులను తనిఖీ చేసి, మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధిస్తారని తెలిపారు. వైరస్ వ్యాప్తిని నివారించడానికి సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. హర్యానాలో కేసులు పెరగుతుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
కరోనా కేసులు, మరణాలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో గురుగ్రామ్‌లోని అధికారులు ఢిల్లీ నుంచి నగరంలోకి వచ్చే వ్యక్తులకు పరీక్షలు చేస్తున్నారు. సోమవారం 2,663 కొత్త కేసులు నమోదుకావడంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 2,19,963 కు చేరుకుంది. కరోనా బారిన పడి మరో 28మంది చనిపోగా మరణాలు సంఖ్య 2,216గా నమోదైంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. తాజాగా గురుగ్రామ్ జిల్లాలో 866, ఫరీదాబాద్‌లో 577 కేసులు నమోదయ్యాయ. దేశంలో కరోనా బారిన పడ్డవారి సంఖ్య సోమవారం నాటికి 91 లక్షలను దాటింది. ఒక్క రోజులోనే 44,059 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
('మళ్లీ లాక్‌డౌన్ విధించే అంశంపై నిర్ణయం తీసుకుంటాం')
Comments
Please login to add a commentAdd a comment