న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను త్వరలోనే అరెస్ట్ చేసేందుకు సీబీఐ ప్రయత్నాలు చేస్తోందని శుక్రవారం ఆప్ తెలిపింది. లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్, ఆప్ చేస్తున్న ప్రయత్నాలతో బీజేపీలో భయం మొదలైందని పేర్కొంది. రెండు పార్టీల మధ్య పొత్తు కుదరకుండా చేసేందుకే తమ నేత కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయాలని చూస్తోందని ఆరోపించింది.
ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై ఆప్, కాంగ్రెస్‌ల మధ్య చర్చలు కొలిక్కి వచ్చిన విషయం తెలియగానే ఈడీ గురువారం కేజ్రీవాల్‌కు ఏడో విడత నోటీసులిచ్చిందని ఆయన చెప్పారు. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసేందుకు సీబీఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందన్నారు. శుక్రవారం సాయంత్రానికల్లా కేజ్రీవాల్‌కు నోటీసులు అందజేస్తుందని, రెండు మూడు రోజుల్లో అరెస్ట్ చేస్తుందని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment