భారతదేశ వీర జవానులు యుద్ధభూమిలో ధైర్యసాహసాలకు ప్రతిబింబంగా నిలిచారు. 1965లో భారతదేశం- పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో భారత సైనికుడు అబ్దుల్ హమీద్ చూపిన తెగువ మరువలేనిది. 1965లో ఆపరేషన్ జిబ్రాల్టర్ వ్యూహం ద్వారా పాకిస్తాన్ భారత్‌పై దాడికి దిగింది. జమ్మూ కాశ్మీర్‌పై దాడి చేసి, అక్కడ తిరుగుబాటును సృష్టించి, కొన్ని సరిహద్దులను తెరవడం ద్వారా భారత సైన్యాన్ని చిక్కుల్లో పెట్టడం దీని లక్ష్యం. 1965 సెప్టెంబరు 8 న పాకిస్తాన్ సైన్యం ఖేమ్‌కరణ్ సెక్టార్‌లోని అసల్ ఉత్తాడ్ గ్రామంపై అమెరికన్ ప్యాటన్ ట్యాంకులతో దాడికి దిగింది.
ఈ దాడుల సమయంలో హమీద్ పంజాబ్‌లోని తరన్‌తారణ్ జిల్లాలోని ఖేమ్ కరణ్ సెక్టార్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అసల్ ఉత్తాడ్‌పై ఈ దాడి హఠాత్తుగా జరిగింది. దీంతో అక్కడ మోహరించిన భారత సైనికులు దీనిని ఊహించలేకపోయారు. వారి వద్ద ట్యాంకులు,పెద్ద ఆయుధాలు అందుబాటులో లేవు. వారి దగ్గర తేలికపాటి మెషిన్ గన్‌లు మాత్రమే ఉన్నాయి. యాంటీ ట్యాంక్ డిటాచ్‌మెంట్ కమాండర్ లేకపోవడంతో, ట్యాంకుల నిర్వహణ బాధ్యతను హమీద్ తీసుకున్నారు. 1965 సెప్టెంబరు 8న హమీద్ పాక్‌కు చెందిన రెండు ట్యాంకులను ధ్వంసం చేశారు. నాలుగు ట్యాంకులను నిర్వీర్యం చేశారు. మరుసటి రోజు పాకిస్తాన్ వైమానిక దళం సాబర్ జెట్ దాడులను ప్రారంభించింది. ఆ సమయంలోనూ హమీద్, అతని సహచరులు ధైర్యసాహసాలు ప్రదర్శించారు. పాకిస్తాన్ సైన్యాన్ని నిలువరించారు.
సెప్టెంబర్ 10న అసర్ అసల్ ఉత్తాడ్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది. పాకిస్తాన్.. ప్యాటన్ ట్యాంకులతో కాల్పులకు తెగబడింది. ఈసారి హమీద్ మరో ట్యాంక్‌ను ధ్వంసం చేశారు. ఈ నేపధ్యంలో పాక్ సైనికులు జరిపిన దాడిలో హమీద్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ యుద్ధంలో అమెరికా అందించిన ప్యాటన్ ట్యాంకులపై పాకిస్తాన్‌కు గట్టినమ్మకం ఉంది. 1965 యుద్ధంలో పాకిస్తాన్‌కు చెందిన మొత్తం 165 ప్యాటన్ ట్యాంకులు ధ్వంసమయ్యాయని లేదా నిరుపయోగంగా మారాయని చెబుతారు. వాటిలో సగానికి పైగా ట్యాంకుటు ఖేమ్ కరణ్ సెక్టార్‌లోనే ధ్వంసమయ్యాయి.
హమీద్ ధైర్యసాహసాలు ఈ యుద్ధంలో నిరూపితమయ్యాయి. భారత సైన్యానికి సత్తా చాటేందుకు పూర్తి అవకాశం లభించింది. పాకిస్తాన్ సైన్యం భారత సైన్యంతో పోరాడలేక తిరోగమించవలసి వచ్చింది. భారత సైన్యం చేతిలో పాక్ ట్యాంకులు ధ్వంసం కావడం ఆ దేశ సైన్యాన్ని నైతికంగా దెబ్బతీసింది. పాక్ వ్యూహం విఫలమవడంతో పాక్ ఆర్మీ ఖేమ్ కరణ్‌లోకి ప్రవేశించేందుకు సాహసించలేదు. భారత సైన్యం దృష్టిని మరల్చాలనే పాక్ వ్యూహం కలగానే మిగిలిపోయింది. ఫలితంగా భారత సైన్యం ఈ యుద్ధంలో ఆధిపత్యం చెలాయించింది. భారత సైన్యం పాక్‌లోకి ప్రవేశించడంతో పాక్ ఓటమి చవిచూసింది.
ఇది కూడా చదవండి: దేశ విభజనకు మౌంట్ బాటన్ కారకుడా?
Comments
Please login to add a commentAdd a comment